పవన్‌.. ఎందుకంత వణుకు? | Sakshi
Sakshi News home page

పవన్‌.. ఎందుకంత వణుకు?

Published Thu, Nov 23 2023 3:15 PM

KSR Comments Over Pawan Kalyan Speech In Telangana - Sakshi

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించిన తీరు చూశాక, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ లేని లోటు తీర్చారని ఒక వెబ్ సైట్ వ్యాఖ్యానించింది. మరో వెబ్ సైట్‌లో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారని తెలిపారు. అలాగే ఇంకోక వెబ్ సైట్‌లో వరంగల్‌లో ఆయన అభిమానులు సీఎం, సీఎం నినాదాలతో హోరెత్తించారని పేర్కొన్నారు. 

ఇలా రకరకాల వ్యాఖ్యలు చూడటంతో అసలు పవన్ ఏమి మాట్లాడారు? ఎంత ఘాటుగా మాట్లాడారు? అన్నది తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఈ క్రమంలో ఆయన ప్రసంగం వీడియోను చూశాను. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చప్పగా ఉందని ఇట్టే తెలిసిపోయింది. కాకపోతే అక్కడకు వెళ్లి కూడా ఏపీలోని వైఎస్సార​్‌సీపీ ప్రభుత్వంపై తన అక్కసు, ద్వేషం వెళ్లగక్కారు. పోనీ అంత ధైర్యవంతుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కానీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కానీ ఒక్క మాట అన్నారా అంటే ఆ ఊసే లేదు.

ఇక, తాను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని కొందరు విమర్శిస్తున్నారని అంటూ ఒక వివరణ ఇచ్చిన తీరు హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో పుట్టిన పార్టీ కోసం పదేళ్లు  ఆయన విమర్శించలేదట. మరి 2014లో బీజేపీ, టీడీపీ కూటమి తరపున ప్రచారం చేసి కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన సంగతి ఆయన మర్చిపోయినా జనం మర్చిపోలేదు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ మరీ ఇంత పచ్చిగా అబద్దాలు చెప్పాలా అని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో పవన్‌ చేసిన ప్రసంగాలపై కేసీఆర్ మండిపడుతూ, ఒక దెబ్బకొడితే తునక, తునక అవుతారంటూ చేసిన హెచ్చరికతో అటువైపునకే వెళ్లలేదు. అంతేకాదు.. పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ కూడా మాట్లాడారు. 

అంతెందుకు! ఒక వైపు బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, బీఆర్ఎస్ ప్రభుత్వంపైన తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు కదా!. వాటిలో కొన్నింటినైనా పవన్ ఎందుకు ప్రస్తావించలేదు?. తన నటనా చాతుర్యంతో ఆవేశం ప్రదర్శిస్తుంటారు కదా!. కనీసం ఆ ప్రకారం అయినా ఎందుకు నటించలేకపోయారు!. ఏదో మాట వరసకు అవినీతి ఇంత ఉందా అంటూ అమాయకపు ఫేస్ పెట్టి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారే తప్ప, దానికి కారణం ఎవరు? అసలు నిజంగా అవినీతి జరిగిందా?మొదలైన విషయాలనే మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. విశేషం ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కేసీఆర్ పేరు ఎత్తడానికే పవన్ కళ్యాణ్ భయపడ్డారన్నది ఎక్కువమంది అభిప్రాయం. పైగా తనలో తెలంగాణ పోరాట స్పూర్తి ఉందని గొప్పలు చెప్పుకోవడం. దాని కారణంగానే ఆంధ్రలో పోరాడుతున్నారట. పదేళ్లుగా నిలబడ్డారట. 

2014 ఎన్నికలలో  జనసేన నిలబడనే లేదు. ఆనాడు ఎన్నికైన టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించింది లేదు. ఏదో ఒకటి, ఏదో ఒకసారి మాట్లాడినా, ఆ వెంటనే చంద్రబాబును కలిసి రాజీపడిపోవడం జరుగుతుండేది. 2019లో మోదీని విమర్శిస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాబివందనం చేసి పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన ఈయన ఆ వెంటనే బీజేపీతో కలవడానికి నానా పాట్లు పడ్డారు. ఇప్పుడేమో మోదీ అంటే  చాలా గౌరవం అని కథలు చెబుతున్నారు. అంత గౌరవం ఉన్న వ్యక్తి అయితే ఏపీలో బీజేపీతో కాపురం చేస్తూ తెలుగుదేశంతో సహజీవనం ఎలా చేస్తున్నారో చెప్పాలి కదా!. ఇప్పుడు కూడా తనకు పోరాటం కన్నా పదవిపై ఆరాటంతోనే టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకున్నారన్నది బహిరంగ రహస్యమే కదా!.

బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని ఇస్తానంటోందని, అందుకే కలిసి పనిచేస్తున్నానని ఆయన అన్నారు. 31 మంది బీజేపీ ముఖ్యమంత్రులు బీసీలు అని పిచ్చి లెక్క చెప్పడం ద్వారా ప్రజలలో నవ్వులపాలయ్యారు. నిజంగానే ఆయనకు బీసీల పట్ల, దళితుల పట్ల అంత ఎమోషన్ ఉంటే ఏపీలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ఎందుకు తహతహలాడుతున్నారో చెప్పాలి!. ఏపీలో బీసీ లేదా, దళిత ముఖ్యమంత్రి కావాలని ఎందుకు చెప్పడం లేదు. పాపం అమాయక అభిమానులు పవన్ స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టగానే సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆయనేమో  తాను అందుకు సిద్దమని ఒకసారి, తాను సీఎం పదవికి పనికిరానని, తనకు ఎవరు ఆ పదవి ఇస్తారని ఇంకోసారి అన్న విషయం వారికి తెలియకపోయి ఉండవచ్చు. 

మరో విశేషం ఏమిటంటే ఆయన తన స్పీచ్‌లో  కాంగ్రెస్‌ను కూడా ఒక్క మాట అనలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి ఒక్క విమర్శ చేయలేదు. తాను ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నందున ఆ పార్టీ జోలికి వెళ్లలేదేమో తెలియదు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతల పంచెలూడదీసి కొడతానని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ నేతల పేర్లే ఎత్తడానికి వణుకుతున్నారని అనుకోవాలి. అదే ఏపీలో మాత్రం సభలలో వారాహి ఎక్కి నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌ను దూషిస్తూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుంటారు. వాళ్లని బట్టలూడదీసి కొడతా, ప్యాకేజీ అంటే చెప్పు తీసుకు కొడతా అంటూ నోరు పారేసుకునే పవన్ కళ్యాణ్ తెలంగాణలో నోరు మెదపడానికే వణికిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి స్పీచ్‌కు తెలంగాణ స్పూర్తి అట. రోమాలు నిక్కబొడుస్తాయట. 

తెలంగాణ ఇస్తే పది రోజులు ఉపవాసం చేశానని చెప్పిన పవన్‌కు అమరవీరులపై గౌరవంతో ఇంతకాలం ఏమీ మాట్లాడలేదట. అబద్దాలు ఆడటానికి అయినా ఒక హద్దు ఉండాలి కదా!. ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో తిరుగుతానని అన్నారట. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రలో తిరిగినట్లే తెలంగాణలో కూడా పర్యటిస్తారట. అంటే బీజేపీ అధికారంలోకి వస్తుందనా? రాదనా? ఆయన ఉద్దేశం. ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతుందనుకుంటే జనంలో నవ్వులపాలు అవుతామన్న సంగతిని ఇంతకాలం తర్వాత కూడా పవన్ గుర్తించలేకపోవడం దురదృష్టకరం. 

ఎక్కడ, ఎప్పుడు ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ రాజకీయాలలో పబ్బం గడుపుకుంటున్న పవన్ కళ్యాణ్ నిజంగానే కేఏ పాల్ తెలంగాణ రాజకీయాలలో  లేని లోటు తీర్చుతున్నట్లే అనుకుంటే తప్పు లేదు. ఆయన కూడా పిట్టల దొర మాదిరి అన్ని వేల కోట్ల రూపాయల గురించి చెబుతుంటారు. ఇప్పుడు సరిగ్గా పవన్ కళ్యాణ్ తన గురించి అలాగే  చెప్పుకున్నారు. అంతే తప్ప ఎన్నికల ప్రచారంలో బీజేపీ, జనసేన గెలిస్తే ప్రజలకు ఒనగూరేదేమిటో మాత్రం వివరించలేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఇంతకన్నా గొప్ప స్టాండర్స్‌ను ఎలా ఆశించగలం!.
- కొమ్మినేని శ్రీనివాసరావు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement