సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మంత్రి సంధ్యా రాణి పీఏ సతీష్.. మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టారు.. మంత్రి డైరెక్షన్‌లోనే ఆమెపై కేసు నమోదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి, సతీష్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను, మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. టీడీపీ తొత్తుల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పీఏ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా?.
బాధితురాలి దగ్గర సతీష్ డబ్బులు తీసుకోవడం నిజం కాదా?. ఇప్పటికైనా సతీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు.


