విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ | - | Sakshi
Sakshi News home page

విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ

Feb 15 2026 12:40 PM | Updated on Feb 15 2026 12:40 PM

విశాఖ

విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ

నేడు మినీ ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌–2026 ప్రారంభం

17న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌, ఐవోఎన్‌ఎస్‌లో పాల్గొననున్న 70 దేశాలు

సాక్షి, విశాఖపట్నం: నీలి సముద్ర అలల సాక్షిగా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత ఘట్టానికి మహా విశాఖ నగరం వేదిక కానుంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ‘మిలాన్‌–2026’, ‘ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)–2026’ కార్యక్రమాలు దేశ సముద్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి. ‘సాగర జలాల్లో స్నేహ వారధుల్ని బలోపేతం చేయడం’ అనే నినాదంతో సాగే ఈ వేడుక కేవలం యుద్ధ విన్యాసాల ప్రదర్శన మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల మధ్య స్నేహం, సహకారానికి ప్రతీకగా నిలవనుంది. ఫ్లీట్‌ రివ్యూలు భారత్‌కు కొత్తవి కావు. ఏడు దశాబ్దాలుగా ఈ నౌకాదళ పండుగ కొనసాగుతోంది.

భారత్‌ శక్తి చాటిచెప్పేలా..

‘శం నో వరుణః’ (సముద్ర దేవుడు మాకు శుభం కలిగించుగాక) అనే నినాద స్ఫూర్తితో భారత నౌకాదళం.. విశాఖ తీరంలో జరగనున్న ఈ విశ్వవేడుకలకు సిద్ధమవుతోంది. ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ ద్వారా ప్రపంచ శాంతి, సముద్ర భద్రతకు కొత్తదారులు వేయాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ బలమైన శక్తి అని చాటిచెప్పేలా స్నేహపూర్వక దేశాలను ఒకేచోట చేర్చుతోంది. ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ చరిత్రలోనే ఇవి అతిపెద్దవిగా నిలవనున్నాయి. ఆదివారం ఉదయం తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం సమీపంలో ఏర్పాటు చేసిన మిలాన్‌ విలేజ్‌ను ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా ప్రారంభించి మిలాన్‌–2026 కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 17వ తేదీ ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎఫ్‌ఆర్‌ను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘మహాసాగర్‌’ దార్శనికత ఆధారంగా ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశారు. ప్రాంతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు 70 దేశాల నౌకాదళాలు పాల్గొననున్నాయి.

లోతల్‌ నుంచి ఆధునిక శక్తి వరకు

క్రీ.పూ. 2400 ప్రాంతంలో గుజరాత్‌లోని లోతల్‌ వద్ద నిర్మించిన ప్రపంచపు తొలి టైడల్‌ డాక్‌ నుంచి భారత సముద్ర చరిత్రకు ఆరంభం లభించింది. సింధు లోయ నాగరికత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ఇది నిదర్శనం. సింధు నాగరికత, చోళుల సామ్రాజ్య కాలంలో సముద్ర వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన భారత్‌, బ్రిటిష్‌ పాలనలో వెనకబడింది. స్వాతంత్య్రానంతరం క్రమంగా బలపడుతూ, ఆధునిక జలాంతర్గాములు, యుద్ధ విమాన వాహక నౌకలతో ప్రపంచంలోనే ప్రధాన రక్షణ శక్తుల్లో ఒకటిగా ఎదిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత పర్యవేక్షణలో భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది.

1953లో తొలి ఫ్లీట్‌ రివ్యూ

‘ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ’ ఈ నెల 18న విశాఖపట్నం వేదికగా అట్టహాసంగా జరగనుంది. అయితే ఫ్లీట్‌ రివ్యూల సంప్రదాయం భారత్‌కు కొత్తది కాదు. 18వ శతాబ్దంలో మరాఠా నౌకాదళాధిపతి కాన్హోజీ అంగ్రే నేతృత్వంలో రత్నగిరి తీరంలో తొలి నౌకల సమీక్ష జరిగింది. స్వాతంత్య్రానంతరం 1953లో స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ప్రారంభించిన ఫ్లీట్‌ రివ్యూతో ఈ సంప్రదాయానికి నూతన రూపం లభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఫ్లీట్‌ రివ్యూలు నిర్వహించగా, ఇది మూడవ అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన కావడం విశేషం.

21 గన్‌ల ఫైరింగ్‌తోరాష్ట్రపతికి గౌరవ వందనం

ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ 18న యాంకరేజ్‌ ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమాన విన్యాసాలను ఆమె సమీక్షిస్తారు. ఈ సందర్భంగా ‘ఐఎన్‌ఎస్‌ సుమేధ’ ప్రెసిడెన్షియల్‌ వాహనంగా వ్యవహరించనుంది. ప్రెసిడెన్షియల్‌ యాచ్‌లో ప్రయాణిస్తూ సముద్రంలో లంగరు వేసిన భారత నౌకాదళం, కోస్ట్‌ గార్డ్‌, మిత్ర దేశాల యుద్ధ నౌకలను రాష్ట్రపతి సమీక్షిస్తారు. అనంతరం 21 ఫిరంగులు గాల్లోకి పేల్చి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించనున్నారు.

ఐఎఫ్‌ఆర్‌–2026 కి స్వాగతం పలుకుతూ యుద్ధ నౌకపై నేవీ సెయిలర్స్‌ విన్యాసాలు

1953లో తొలి ఫ్లీట్‌ రివ్యూ

విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ 1
1/1

విశాఖ తీరాన విశ్వ నౌకల పండగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement