రూ.2కోట్లే!
రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రం
● విశాఖ మెట్రోకు విజయవాడ లింక్.. పనులపై నీలినీడలు
● ఏయూ, సాగునీటి ప్రాజెక్టులపైనా చిన్నచూపు
● తాండవ ఎత్తిపోతలకు చెక్.. నిర్వహణకే పరిమితం
● విశాఖ–చైన్నె కారిడార్ భారం జీవీఎంసీపైనే...
● అరకు కాఫీపై అదే పాత పాట
ప్రజల్ని మోసం చేసే ‘అంకెల గారడీ’
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పూర్తిగా ప్రజల్ని మోసం చేసేదిగా ఉంది. ఇందులో అంకెల గారడీ తప్ప, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు నిరుద్యోగులకు ఈ బడ్జెట్‌లో రిక్తహస్తాలే దక్కాయి. పేదల పాలిట వరమైన ఆరోగ్యశ్రీని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. అలాగే మహిళలకు కూడా ఈ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగింది.
–పాకా సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి
విశాఖకు విదిల్చింది..
‘ఆడబిడ్డ’కు మొండిచేయి
ఎన్నికల సమయంలో.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే వారందరికీ నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోతోంది. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని మేమంతా ఎంతో ఆశగా ఎదురు చూశాం. కానీ, ఇందులో మహిళల సంక్షేమం గురించి గానీ, వారికి అందించాల్సిన ‘ఆడ బిడ్డ నిధి’ సాయం గురించి గానీ కనీస ప్రస్తావన లేదు. ఇది మహిళలను మోసం చేయడమే అవుతుంది. ప్రభుత్వ తీరుతో మా ఆశలన్నీ అడియాసలయ్యాయి. – దివి చంద్రకళ, మధురవాడ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
భారీ బడ్జెట్ లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశాఖ నగర అభివృద్ధికి విదిల్చిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ. 2 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో విశాఖ నగరానికి దక్కింది 0.000006 శాతం మాత్రమే. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా.. మరోవైపు విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్ పనుల భారాన్ని జీవీఎంసీపై మోపింది. ఇందుకోసం జీవీఎంసీ ఖజానా నుంచి రూ.22.28 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు.. ఇంకా ఆమోదం లభించని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులను కేటాయించింది. దీనిని బట్టి విజయవాడ మెట్రో పనులు మొదలయ్యే దాకా విశాఖలో పనులు మొదలు పెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్లయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తాండవ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కేవలం ప్రాజెక్టు నిర్వహణ కోసం మాత్రమే తూతూమంత్రంగా నిధులను కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 605 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా.. ఆచరణలో ఈ నిధుల్లో అత్యధిక భాగం కేవలం పునరావాసం, జీత భత్యాలకే సరిపోనున్నాయి. మరోవైపు ఏజెన్సీపై అదే వివక్షను కొనసాగించింది. గత ఏడాది చెప్పినట్టుగానే ఈ సారి కూడా 25 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.16కోట్ల మేర నిధులను కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో చూపారు.
ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఉత్తుత్తి ప్రేమను ప్రదర్శిస్తోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించినట్లు చూపారు. అయితే, వాస్తవానికి ఇందులో సింహభాగం నిధులు పునరావాసం, జీతభత్యాలకే సరిపోనున్నాయి. ఈ రెండు పద్దులకే రూ. 400 కోట్లకు పైగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. అంటే, అసలైన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కనీసం రూ.200 కోట్లు కూడా మిగలవని స్పష్టమవుతోంది. మరోవైపు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రూ.470 కోట్లతో ప్రారంభించిన తాండవ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూమంత్రంగా కేవలం రూ.8.13 కోట్లను మాత్ర మే కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
‘సూపర్ సిక్స్’జాడేది?
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించిన ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. యువతకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందించే పథకానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మరోవైపు గ్యాస్ రాయితీ కింద ఇవ్వాల్సిన మొత్తానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్‌లో చూపించడం గమనార్హం. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం ద్వారా, పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరికొన్ని అరకొర కేటాయింపులివే...
● విశాఖ, తిరుపతి జూ పార్కులకు కలిపి బడ్జెట్‌లో కేవలం రూ. 3.30కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన విశాఖ జూ పార్కు వాటా రూ.1.65 కోట్లకు పరిమితమైనట్లేనని స్పష్టమవుతోంది.
● విశాఖపట్నం, కడప జిల్లాలోని ఉన్న మానసిక ఆసుపత్రులకు రూ.13 కోట్లను కేటాయింపులు జరిగాయి. ఇందులో విశాఖ మానసిక ఆసుపత్రికి సగటున రూ. 6.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చే నిధులు కావడం గమనార్హం.
● తొట్లకొండ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రేహౌండ్స్ భవనాలకు రూ. 3 కోట్లు, విశాఖలోని గ్రేహౌండ్స్ రీజనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ. 3 కోట్లు కేటాయించారు. పీఎంపాలెంలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి రూ. 3.5 కోట్లు కేటాయించారు.
● విచిత్రమేమిటంటే... విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనంతో పాటు... ఆరిలోవ ఏసీపీ కార్యాలయం, మహారాణిపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1.5 కోట్లు విదిల్చారు. మొత్తంగా నగరాభివృద్ధితో పాటు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ అరకొర కేటాయింపులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘సుఖీభవ’ నిధులకు కోత.. రైతులకు దగా
‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు మొండిచేయి చూపారు. ఇక 2025–26లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశాయి. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.2వేలు కూడా జమ కాలేదు. మొత్తంగా చూస్తే మొదటి ఏడాది రూ.20 వేలు, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పున రైతులకు బకాయి పడ్డారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతు భరోసా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లూ ఠంచనుగా పెట్టుబడి సాయం అందించాయి. రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.10,800 కోట్లు అవసరం కాగా.. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి వచ్చే ఏడాది కూడా ఈ పథకం రైతులకు పూర్తిగా అందనట్టేనని స్పష్టమవుతోంది. రైతులను ప్రభుత్వం దగా చేసింది. – కర్రి నాయుడుబాబు, రైతు, పేకేరు, ఆనందపురం మండలం
నిరుద్యోగ భృతి మాటేది?
రాష్ట్ర బడ్జెట్‌లో ఎలాంటి రాయి తీలు, మేలు చేసే అంశాలు ఉంటాయోనని నాలాంటి యువత ఎదురు చూశారు. కానీ మా ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తా మన్నారు. కానీ బడ్జెట్‌లో దాని ఊసే లేదు. ఇక ఈ ఏడాది భృతి లేనట్టే. పాలకులకు మళ్లీ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకువస్తుందేమో. బడ్జెట్ అంతా కల్లబొల్లి కబుర్లే అన్నట్టుగా ఉంది. –వి.శివశంకర్, నగరంపాలెం
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!


