గర్భిణిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్
నిందితుడు అజయ్‌దేవ్ జనసేన కార్యకర్తగా గుర్తింపు
సాక్షి, పుట్టపర్తి: దాడి ఏదైనా.. గొడవ ఎక్కడ జరిగినా.. రాజకీయ రంగు పూసి ‘రెచ్చిపోదాం.. రచ్చ చేద్దాం’ తరహాలో కూటమి పార్టీల నాయకులు తయారయ్యారు. నిందితులకు వైఎస్సార్‌సీసీ ముద్ర వేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణపై దాడి ఘటనే ఇందుకు నిదర్శనం.
ఈ నెల 21వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల అనంతరం అజయ్‌దేవ్ అనే యువకుడు గర్భిణిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ‘నిండు గర్భిణిని వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు’ అంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి అజయ్‌దేవ్ జనసేన పార్టీ కార్యకర్త.
అతడిపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేయడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని చితకబాదారు. నడవలేని స్థితిలోనూ రోడ్డు మీద ఊరేగిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ, గంటల వ్యవధిలోనే అజయ్ జనసేన కార్యకర్త అని తేలిపోయింది. అతడిని రిమాండ్‌కు పంపిన తర్వాత అసలువిషయం బయటకు వచ్చింది. అతడు జనసేనకు చెందినవాడని స్వయంగా అతని సోదరి రజిత, జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యుడు అమర్ కార్తికేయ వెల్లడించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పారు.
తనకు పదేళ్ల నుంచి అజయ్ తెలుసని, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో అతడిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా చిత్రీకరించిందని అమర్ మండిపడ్డారు. పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అతడు పాల్గొన్న ఫొటోలు విడుదల చేశారు. ‘‘పవన్‌కళ్యాణ్ అంటే అజయ్‌కు విపరీతమైన అభిమానం. ముందు నుంచి నా సోదరుడు జనసేనలోనే కొనసాగుతున్నాడు.
అనవసరంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని ముద్ర వేశారు’’ అని అజయ్‌దేవ్ సోదరి రజిత బుధవారం వీడియో విడుదల చేశారు. అజయ్‌దేవ్ వైఎస్సార్‌సీపీ అని తొలుత ప్రచారం కావడంతో మంత్రి నారా లోకేశ్ కామెంట్ చేశారు. ‘ఇదేం పైశాచికం జగన్ గారూ’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. మరి లోకేశ్ ఇప్పుడు ఏమంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
లోకేశ్ ఏం చెబుతారు?
ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
అజయ్‌దేవ్ విషయంలో హోం మంత్రి అనిత స్పందించాలి. ఘటనకు ఠక్కున రాజకీయ రంగు పూసి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. రామగిరిలో దళిత బాలికపై, హిందూపురంలో అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ విషయంలో కూటమి పార్టీల నాయకులు ఎందుకు నోరు మెదపలేదు? కానీ, అజయ్‌దేవ్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అనే అనుమానంతో చకచకా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ ఏమి చెబుతారు?


