బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం! | KSR Comments On Sai Krishna Case, Political Storm Erupts Over Allegations, Government Response And Justice Debate In AP | Sakshi
Sakshi News home page

బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!

Jun 24 2026 11:06 AM | Updated on Jun 24 2026 1:23 PM

Kommineni Srinivasa rao Comments On Chandrababu and Yellow Media

ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే  ఎంత చిన్న కేసు  అయినా  దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న  నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో  తన  ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. 

అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి  లాకప్ డెత్ కేసును చంద్రబాబు  ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ  తల్లికాని, ఇతర  కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి,  చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.

ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు  చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లతో  పాటు లోకేష్‌కు కూడా ధన్యవాదాలు  తెలిపిన వైనం  ఆసక్తికరంగా మారింది.  వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే  అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే  భయపడ్డారేమో అన్న  సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా  సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో  అన్న సంశయం కలుగుతుంది.   మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై  పోరాటం ఆపబోమని అన్నారు. 

జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ  సంచలన  విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత  సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని  పరామర్శించిన  జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా  జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు.

 సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక,  పరిస్థితి తీవ్రతను గమనించిన  చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు  వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ  నాగరాజుకే  పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన  పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. 

ఇటీవలి కాలంలో పలు  ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా   ఇబ్బంది పడుతుండడం  ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో  సాయికృష్ణ  కుటుంబ సభ్యులను  తన వైపునకు తిప్పుకుంటే  మొత్తం కేసు  బలహీనపడిపోవచ్చని  అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర  పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్  హింసలు,  పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న  ఘటనలు మరిన్ని  వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను  తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్   ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. 

వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు.  తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర  చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు  అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు  ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు  నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.  సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ  కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ  తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.

ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి  మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న  ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ  మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి  అర్ధరాత్రి వేళ కేసు  నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం  సస్పెండ్ చేసింది. 

మరో వైపు విజయవాడ తూర్పు  నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో    ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను  ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను  ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది.  కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం  చేయలేరని,  ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన  అన్నారు..సాయికృష్ణను  మార్కాపురం నుంచి  విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్  స్టేషన్ లోను,  తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను  పెట్టి తీవ్రంగా హింసించడం,  గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే  ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన  పెట్టుకున్నారని  ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు  చంద్రబాబును కలిసిన తర్వాత  తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు  తావిచ్చింది. 

ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు  విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు   పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ  ప్రభావం అధికంగా ఉన్న  రోజులలో  కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. 

గతంలో   కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు  సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై  అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది.  బలహీనవర్గాలవారిపైన  ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా  హింసించడం,  చిన్న,చిన్న కేసులలో సైతం   వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం,  అదే  టీడీపీ వారు  ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. 

అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్  దాడి చేస్తే మాత్రం  పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ  జగన్ దేశం అంతటికి తెలియచేసే  యత్నం చేశారు. చంద్రబాబు  ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను  కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement