ఎల్లో మీడియాకు మింగుడుపడని నిజం | Kommineni Comment On Yellow Media No Coverage On CBN IT Notices - Sakshi
Sakshi News home page

సోకాల్డ్‌ నిప్పుకు కష్టం.. ఎల్లో మీడియాకు మింగుడుపడని నిజం

Sep 2 2023 9:54 AM | Updated on Sep 2 2023 10:42 AM

Kommineni Comment On Yellow Media No Coverage On CBN IT Notices  - Sakshi

నిజం కాకపోయి ఉంటే.. బాబుగారు ఒంటికాలుపై ఇంతెత్తున లేచేవారు. ఆయన పార్టీ..

మామూలుగా అయితే ఇలాంటి స్కామ్ బయటపడితే మీడియాలో అల్లరల్లరిగా వార్తలు ఇస్తారు. ఒకవేళ ఆ స్కామ్ లు నిజం కాకపోతే దాని గురించి అయినా వాదనలు వినిపిస్తూ టివీలు హోరెత్తేవి. కానీ, చిత్రంగా తెలుగుదేశం పార్టీని భుజాన మోసుకుంటూ ఊరేగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి సంస్థలు తేలుకుట్టిన దొంగల మాదిరి సైలెంట్ అయిపోయాయి. అదేమిటో తెలుసుకదా!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇవ్వడం.. ఎంత పెద్ద సంచలనం!. అందులోనూ ఆయన రూ. 118 కోట్ల మేర ప్రకటించని- వెల్లడించని ఆదాయంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంటే ఆ మేర చంద్రబాబుకు బ్లాక్ మనీ రూపంలో డబ్బు అందిందని అర్దం అని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఈనాడు అసలు వార్త ఇవ్వకుండా.. లోపలి పేజీలో ఎక్కడో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యను చిన్నగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అయితే పాత కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులు వచ్చాయని, ఎప్పుడో చంద్రబాబు సమాధానం ఇచ్చేశారని, ఇంతకాలం ఏమీ జరగకుండా ఇప్పుడు మళ్లీ నోటీసు రావడం వెనుక వైఎస్సార్‌సీపీ ఒత్తిడి ఉందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయంటూ వార్తను ఇచ్చింది. ఒక ఆంగ్ల పత్రిక మాత్రం ఈ కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు విశ్వయత్నాలు చేస్తున్నారని ఐటీ శాఖ చెబుతున్నట్లు  పేర్కొంది. ఏ సాంకేతిక కారణాలతో దీనిని అడ్డుకోవాలా అన్న ఆలోచనలో  ఆయన ఉన్నారట. నోటీసు ఇచ్చిన ఐటీ శాఖ పరిధి.. తదితర అంశాలపై అభ్యంతరాలు చెప్పాలని చూస్తున్నారట.

✍️ ఈ తాజా నోటీసుకు నేపథ్యం చూద్దాం. అమరావతి రాజధాని పేరుతో సీఎంగా ఉన్నప్పుడు  చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేసే యత్నం చేశారు. అదైనా శాశ్వతపనులకు ఖర్చు చేశారా అంటే లేదు. కేవలం తాత్కాలిక భవనాలకు భారీ ఎత్తున ధన వ్యయం చేయడంపై అప్పట్లోనే అంతా ముక్కున వేలేసుకున్నారు. చదరపు అడుగుకు పదివేల రూపాయల చొప్పున వెచ్చించినా ప్రమాణికమైన భవనాలు రాలేదు.. అవి కూడా నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. వర్షం కురిస్తే అవికారుతూ బక్కెట్లతో నీళ్లను తోడి బయట పోయవల్సిన పరిస్థితి ఉంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాల నిర్మాణాలలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు దబాయిస్తూ కథ నడిపారు. పైగా అమరావతి రాజధాని ఉద్యమం అంటూ ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి అవినీతి అభియోగాలను దారిమళ్లించే ప్రయత్నం చేశారు. అయినా ఏదో ఒకరోజు అవినీతి వాసన బయటకు రాకుండా ఉంటుందా?..

✍️ ఎంత తాను లీగల్ గా , టెక్నికల్ గా దొరకనని ఇంతకాలం చెబుతూ వచ్చినా ఎప్పుడో అప్పుడు దొరకకపోరా? చంద్రబాబు విషయంలోనూ అదే జరిగినట్లు అనిపిస్తుంది. ఇంతకాలం ఆయా వ్యవస్థలలో తన మనుషులను పెట్టుకుని ఎక్కడా ఇబ్బంది రాకుండా చేసుకుంటూ , న్యాయ వ్యవస్థ ద్వారా స్టేలు పొందుతూ , కేసులు లేకుండా చేసుకుంటూ తనకు ఉన్న మానిప్యులేషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించి నెట్టుకువస్తున్నారు. ఆయా వ్యవస్థల నుంచి తన మనుషులు నిష్క్రమిస్తున్నట్లుగా ఉంది. అందువల్లే ఎలాంటి ప్రభావానికి లోనుకాని అధికారులు ఎవరో రాజీపడకుండా కేసును క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు పేర్కొన్న అభ్యంతరాలను తోసిపుచ్చి తాజా నోటీసు ఇచ్చారనుకోవాలి. గతంలోనే ఐటీ శాఖ నోటీసు ఇచ్చినా, ఏదో రకంగా ఇంతకాలం అది ముందుకు కదలకుండా జాగ్రత్తలు పడ్డారని అనుకోవాలి. కాని ఇప్పుడు మొహమాటం లేకుండా రూ. 118 కోట్ల రూపాయల డబ్బు పొందారన్న అభిప్రాయం తెలుపుతూ మరో నోటీసును అధికారులు  ఇచ్చారు.

నిజానికి మూడున్నర ఏళ్ల క్రితమే చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటీ, ఈడీ వంటి సంస్థలు సోదాలు జరిపి రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు అధికారికంగానే ప్రకటించాయి. కాని ఆ తర్వాత ఆశ్చర్యంగా ఆ కేసులు ఏమయ్యాయో ఎవరికి తెలియలేదు. కేంద్ర ప్రభుత్వంలోని వారిని మేనేజ్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం ప్రచారం అయ్యింది. కాని మేనేజ్ మెంట్ ప్రభావం తగ్గుతూ వచ్చిందేమో తెలియదుకాని, ఆదాయపన్ను శాఖ మళ్లీ ఆ కేసు విచారణ కొనసాగించి  అమరావతి రాజధాని లో వివిధ భవన నిర్మాణాల కాంట్రాక్టు పొందిన షాపూర్‌జీ ఎల్లొంజి సంస్థ వారిపైన, అలాగే సబ్ కాంట్రాక్టర్ మనోజ్ తదితరులపై కూడా సోదాలు నిర్వహించారు. అప్పుడు వారు ఆశ్చర్యపోయేలా బ్లాక్ మనీ బాగోతం బయటకు వచ్చింది. దానిని నిర్ధారించుకున్న తర్వాత రూ. 118 కోట్లకు సంబంధించిన నోటీసును ఐటి శాఖ జారీ చేసింది. ఈ నోటీసు గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఆంగ్ల పత్రిక హిందూస్తాన్ టైమ్స్ దీనిని వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో అసలు విషయం బయటపడింది.

✍️ ఇది నిజం కాకపోతే చంద్రబాబుగారు ఒంటికాలుపై ఇంతెత్తున లేచేవారు. టీడీపీ నేతలంతా ఆ పత్రికపైన, ఆ వార్తను ప్రచారం చేసిన సాక్షి, వైఎస్సార్‌సీపీ నేతలపై ఎగెరిగి పడేవారు.కాని పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. 1995 సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భాన్ని గతంలో పలుమార్లు ఒక పెద్ద కార్యక్రమంగా జరుపుకున్నారు. కాని ఈ ఐటీ నోటీసు బహిర్గతం కావడంతో ఎక్కడా కిక్కురుమన్నట్లు కనిపించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోగలుగుతారన్నది ఆసక్తికర విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దలతో స్నేహం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆయన  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఒకసారి కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపించారు. అవేవి సత్పలితాలు ఇవ్వకపోవడంతో మరోసారి ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. అందుకు తన మామ ఎన్.టి.ఆర్. పేరుతో నాణేల విడుదల కార్యక్రమానికి హాజరైన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తో చంద్రబాబు మంతనాలు జరిపారు. అదంతా కేవలం బిజెపితో ఎన్నికల పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు అంతా అనుకున్నారు. కాని దాని వెనుక అసలు కారణం ఈ కేసు అన్న సంగతి ఇప్పుడు అర్దం అవుతోంది. తన జోలికి ఐటి అధికారులు రాకుండా చూడాలని కోరి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆ క్రమంలో ఎపిలో ఒకశాతం ఓట్ల బలం కూడా లేని బిజెపికి ఏకంగా 25 అసెంబ్లీ సీట్లు, ఐదు లోక్ సభ సీట్లు ఇవ్వబానికి చంద్రబాబు ముందుకు రావడంలో ఉన్న లోగుట్టు కూడా ఇదే అయి ఉండవచ్చన్న అనుమానం బలపడుతోంది.

✍️ చంద్రబాబుకు దత్తపుత్రుడు అనే విమర్శలు ఎదుర్కుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని, చీటికి మాటికి టిడిపిని వెనుకేసుకు వచ్చే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కాని దీనిపై మౌనం దాల్చారు.  ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో సుమారురూ. 370 కోట్ల, ఫైబర్ గ్రిడ్ కేసులో రూ. 300 కోట్లు ఇలా పలు అభియోగాలు చంద్రబాబు టీమ్ పై వచ్చాయి. వాటిని విచారించాలని ఏపీ ప్రభుత్వం ఈడి వంటి సంస్థలను కోరింది. అవి ఎంతవరకు ముందుకు వెళ్లింది తెలియదు. కాని ప్రస్తుతం ముందుగా రూ. 118 కోట్ల కేసు నోటీసు రావడంతో ఈ స్కామ్ లపై కదలిక మొదలైందని అర్ధం అవుతుంది.

✍️ దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చంద్రబాబు, రామోజీ,రాధాకృష్ణ,టివి 5 నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు.హిందుస్తాన్ టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేయాలని చాలెంజ్ చేశారు. లేదా ఇదంతా కుట్ర అని భావిస్తే గతంలో విమర్శించినట్లు ప్రధానమంత్రి మోదీపై మరోసారి విరుచుకుని పడి ఉండవచ్చు. కాని అవేవి చేయలేదు.అంటే ఏమిటి దాని అర్ధం?.. ఈ నోటీసులో ఉన్నదాని ప్రకారం రూ. 118 కోట్ల బ్లాక్ మనీ అనండి...ముడుపులు అనండి ..మరే పేరైనా పెట్టండి.. అంత మొత్తం ముట్టినట్లు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా!. కనీసం టీడీపీ అధికార ప్రతినిది ఎవరితోనూ దీనిపై మాట్లాడించలేదు.

✍️ స్కిల్ కేసు, పైబర్ గ్రిడ్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కక్షతో పెట్టిందని ఆరోపించిన తెలుగుదేశం ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు గురించి నోరు విప్పడం లేదు. గతంలో ఓటుకు నోటు కేసులో ఏభై లక్షల రూపాయలతో చంద్రబాబు అనుచరుడుగా అప్పట్లో ఉన్న ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుబడినా, ఆ చార్జిషీట్ లో చంద్రబాబు పేరు ముప్పైసార్లుకు పైగా ప్రస్తావించినా, తనపై కేసు రాకుండా చూసుకోగలిగారు.చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పట్లో అన్నాకూడా.. కేంద్ర స్థాయిలో ముఖ్యస్థానాలలో ఉన్న కొందరు ప్రముఖులు ఈ కేసునుంచి చంద్రబాబును రక్షించడానికి నడుం కట్టారు. దాంతో కేసీఆర్‌ కూడా అంగీకరించి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబుకు షరతు పెట్టారు. ఆ రకంగా ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత కూడా తన పద్దతి మార్చుకోకుండా అమరావతి రాజధాని పేరుతో మళ్లీ స్కామ్ కు శ్రీకారం చుట్టారు. దాని ఫలితమే అమరావతిలో ఆర్ధిక అరాచకం. వందల కోట్ల కుంభకోణాలు. ఇవి జరిగిన తీరును ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో పూసగుచ్చినట్లు వివరించారు.

మరో ఎనిమిది,తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో  ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు పరిణామాలు ముందుకు వెళితే టీడీపీకి, చంద్రబాబుకు  పెద్ద షాక్ అని చెప్పాలి. కేవలం భూమి కొన్నారని ఆరోపణ చేసినందుకే చలనచిత్ర అభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణమురళీపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. ఇప్పుడు ఇంత పెద్ద అభియోగం వచ్చినందున ఆయన తండ్రి ఇంకెంత పెద్ద పరువు నష్టం దావా వేయాలి?.. అలా దావా వేయకపోతే అవినీతికి పాల్పడినట్లు, ముడుపులు తీసుకున్నట్లు , తాను నిప్పు కాదని ఒప్పుకున్నట్లేనా!. 


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement