సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన
45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు
జ్వరం, ఇన్ఫెక్షన్లతో మరణించారంటే వైద్య సాయం అందనట్లే..!
హాస్టళ్లలో ఉండే పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతేనన్న హైకోర్టు
మృతుల కుటుంబాలకు పరిహారం ఏమైనా ఇచ్చారా..?
ఈ విషయంలో మీవద్ద ఒక నిర్దిష్ట విధానం ఏదైనా ఉందా?
హాస్టళ్లలో వైద్య శిబిరాలపై కార్యాచరణ రూపొందించండి
ఏ కారణంతో మరణించారో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది పిల్లలు చనిపోవడం చిన్న విషయమేమీ కాదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో పిల్లలు మృతి చెందారని చెబుతున్నారంటే... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో, తగిన వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే!
– రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. విద్యార్థులు జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో చనిపోవడం అంటే ముందుజాగ్రత్త చర్యలు, తగిన వైద్యం అందించడంలో దారుణంగా విఫలమైనట్లేనని ఆక్షేపించింది. సంక్షేమ హాస్టళ్లలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో నిర్దిష్ట విధానం ఉందా...? అని ప్రశ్నించింది. ఉంటే దానిని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాస్టళ్లలో నెలలో ఎన్నిసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని, ఇప్పటివరకు సంభవించిన మరణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది.
విద్యార్థులు ఏఏ కారణాలతో చనిపోయారో చెబుతూ, అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా అందించాలంది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన ఓ పిల్‌లో కూడా ఈ వివరాలు అన్నింటినీ పొందుపరచాలని ప్రభుత్వానికి నిర్దేశించింది.
కారణాలు తెలుసుకుంటాం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, 45 మంది విద్యార్థులు చనిపోయారని పిటిషనర్ చెబుతున్నారని... అందుకు కారణాలు ఏమిటి? హాస్టళ్లలోని పరిస్థితుల నేపథ్యమా? లేక ఇతర అంశాలు ఉన్నాయా? అన్న విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. పిల్లలు మరణించినప్పుడు అందుకుగల కారణాలపై నివేదికలు ఉంటాయని, వాటిని కూడా కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ప్రతి 15 రోజులకు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని గ్రామాల్లోని ఏఎన్‌ఎంలకు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు వీలుగా ధర్మాసనం విచారణను 21కి వాయిదా వేసింది.
ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో పిల్లల బాగోగులు చూసేందుకు హెల్త్ వలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సంక్షేమ హాస్టళ్లలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయన్నారు. హెల్త్ వలంటీర్లను నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.


