రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది | Kishan Reddy Sensational Comments on BRS and Congress party | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది

Jun 2 2025 2:09 AM | Updated on Jun 2 2025 2:09 AM

Kishan Reddy Sensational Comments on BRS and Congress party

సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

దండుకున్న సొమ్ము పంపకాల్లో గొడవలే ఇందుకు కారణం 

ఆ డ్రామాలో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదు 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి 

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పుడు ఓ కుటుంబ డ్రామా నడుస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు దండుకున్న సొమ్మును పంచుకోవడంలో తలెత్తిన గొడవలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసి దోచుకున్న ఆస్తుల కోసం జరుగుతున్న గొడవల్లో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచి్చన ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మచ్చలేని పాలన సాగిస్తోందన్నారు. 

మోదీ పాలనపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు. విద్యుత్, ఎరువులు, రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. రాహుల్‌ గాం«దీకి దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు.  

వర్క్‌షాప్‌కు పలువురు డుమ్మా.. 
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆర్‌.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు హజరయ్యారు. ఎంపీ కె.లక్ష్మణ్‌ నిజామాబాద్‌ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, గోడెం నగేశ్‌ గైర్హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement