దర్జాగా బతుకుతున్నం.. మళ్లీ దగా పడదమా?  | KCR comments over bjp and congress party | Sakshi
Sakshi News home page

దర్జాగా బతుకుతున్నం.. మళ్లీ దగా పడదమా? 

Nov 18 2023 4:14 AM | Updated on Nov 18 2023 11:10 AM

KCR comments over bjp and congress party - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. కొత్తకుండలో ఈగ జొచ్చినట్లు ఒక్కటొక్కటిగా సర్దుకుని దగాపడ్డ రాష్ట్రంలో దర్జాగా బతికే స్థాయికి చేరుకున్నం.. ఆనాడు తలసరి ఆదాయంలో 19, 20వ స్థానం.. ఇప్పుడు దేశంలోనే నంబర్‌వన్‌.. మల్ల ఎలక్షన్లు వచ్చినయ్‌ కాంగ్రెసోళ్లు ఏదేదో చెబుతున్నరు.. వాళ్ల వీళ్ల మాటలు నమ్మి ఆగమై పోదమా, ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించుకుందమా? కాంగ్రెస్‌ దోఖేబాజ్‌ పార్టీ.

బీజేపీది మతపిచ్చి. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మొద్దు. ఆలోచించి బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి..’అని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాల, కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంటలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు.  

అప్పటి, ఇప్పటి అభివృద్ధిని బేరీజు వేసుకోండి 
‘తెలంగాణలో 58 ఏళ్ల గోసకు ఈనాడు హామీల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీయే కారణం. ఉన్న తెలంగాణను ఆంధ్రల కలిపి, ఉద్యమకారులను కాల్చి చంపి, 58 ఏళ్లు తెలంగాణ ప్రజలను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన నిరంతర ఉద్యమంలో భాగంగా 1969లో 400 మంది, మలివిడతలో 1,200 మంది బలిదానాల ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది.

ఇలాంటి నేప థ్యంలో సబ్బండ వర్గాల ఉద్యమ ఉధృతిని చూడటం, 33 రాష్ట్రాల మద్దతు కూడగట్టుకోవడం వల్ల ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను 50 ఏళ్లు ఏలిన కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, పదేళ్లలో బీఆర్‌ఏస్‌ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలి. అప్పట్లో టీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం. అలాంటి పార్టీ ప్రజల బాగు కోరుతుందే తప్ప మరొకటి లేదు. ఎవరో చెప్పారని ప్రలోభాలకు లోనుకావొద్దు.

రాష్ట్ర అవతరణ నాటి కి, ఇప్పటికీ రాష్ట్రంలో మారిన ప్రజల ఆర్థిక, సామాజిక, వ్యవసాయ స్థితిగతులు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకోండి. భూ సమస్యలు లేకుండా, దళారీ.. పైరవీల వ్యవస్థ లేకుండా పారదర్శకత కోసం ధరణి చేపట్టాం..’అని కేసీఆర్‌ తెలిపారు. 

భూ మాత పాత పథకమే.. 
‘కాంగ్రెస్‌ నేతలు ధరణిని వక్రీకరిస్తున్నారు. అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు. ధరణి స్థానంలో తెస్తామని చెబుతున్న భూ మాత పోర్టల్‌ కొత్తదేం కాదు. 30, 40 ఏళ్ల కింద పథకం. దానితో ఒరేగేదేమీ లేదు. కేసీఆర్‌కు పనిలేదని, రైతుబంధు ఉత్తదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంటు చాలన్నడు. 30 లక్షల మోటార్లను 10 హెచ్‌పీకి పెంచాలా? వారి మాటలకు నెత్తా కత్తా (నెత్తి కాదు.. కత్తి కాదు)? ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఎవరిని బంగాళాఖాతంలో వేయాలో మీరే చెప్పండి..’అని కేసీఆర్‌ అన్నారు.  

మతం పంచాయితీలు పెట్టే పార్టీ బీజేపీ 
‘ఇక తెల్లారి లేస్తే ప్రజల మధ్య మతం పంచాయితీలు పెట్టే పార్టీ బీజేపీ. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని పార్టీ. మోటా ర్లకు మీటర్లు పెట్టలేదన్న అక్కసుతో తెలంగాణకు రూ.25 వేల కో ట్లు కోత పెట్టింది. మెడికల్‌ కాలేజీల విషయంలో తెలంగాణకు మొండిచేయి చూ పింది. నేను 100 లెటర్లు రాసినా పట్టించుకోలేదు. చట్ట ప్రకారం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలి.

కానీ బీజేపీ సర్కారు చట్టాల్ని భేఖాతరు చే స్తూ రాష్ట్రానికి ఒక్క నవోదయను కూడా మంజూ రు చేయలేదు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన, గత పదేళ్లలో కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలన చూడాలి. పాలిచ్చే బర్రెను అమ్మి దున్న పోతును తెచ్చుకుంటే మెడకు తుంట కట్టుకున్నట్టు అవుతుంది.

పొరపాటున కాంగ్రెస్‌ చేతికి అధికారమొస్తే వైకుంఠంలో పెద్దపాము మింగిన తరహాలో మళ్లీ గోసపడతాం, వెనక్కిపోతాం. బీజేపీకి ఒక్క ఓ టు కూడా వేయొద్దు. ఓటు మీ చేతిలో పాశుపతాస్త్రం.. ఆ ఓట్లతో గెలిచిన చిత్తశుద్ధి గల నాయకులతో నే అభివృద్ధి సాధ్యం. కాబట్టి ఆలోచించి ఓటు వే యాలి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. 

కరీంనగర్‌ సభలో భావోద్వేగం 
‘రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇంటింటికీ 24 గంటల పాటు తాగునీటిని అందజేస్తాం. 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిని 4 కోట్లకు పెంచేందుకు సంసిద్ధమయ్యాం. వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో నిరుద్యోగులకు ఉపాధి పెంచుతాం. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో మాట్లాడి పరకాలలో కోర్టును ఏర్పాటు చేస్తా. కొండగట్టును రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేసుకుందాం. గర్షకుర్తి, గోపాల్‌రావుపేటలను మండలాలుగా చేస్తా.

ఉప్పల్, వావిలాల, చల్లూరులను కూడా మండలాలుగా చేస్తా..’అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ ఎస్సారార్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సారార్‌ కాలేజీలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. గతంలో ఒకసారి (హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో) తనను బాధ పెట్టారని, ఈసారి ఆ పని చేయకండని అన్నారు.

ఈ సభల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎంపీ పసునూరి దయాకర్, నేతలు, అభ్యర్థులు చల్లా ధర్మారెడ్డి, మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, సుంకె రవిశంకర్, కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement