టీడీపీ నేత అనుచరుడికి జనసేనలో పదవి? | Jana Sena Workers Upset Over Key Post Given To TDP Leader’s Close Aide In Bapatla Committee, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత అనుచరుడికి జనసేనలో పదవి?

Jun 30 2026 1:30 PM | Updated on Jun 30 2026 1:52 PM

Janasena Appointment To TDP Members Sparks Row In Bapatla

కొల్లూరు: జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్‌ సమాచార సేకరణ కమిటీలో టీడీపీ నాయకుడి ముఖ్య అనుచరుడికి పదవి కేటాయించడంపై జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్‌ ప్రధాన అనుచరుడిగా మెలుగుతున్న వ్యక్తికి జనసేనలో పదవి కేటాయించడం ఇటు జనసేన.. అటు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చానీయంశంగా మారింది. టీడీపీ సభ్యత్వం ఉండి..ఆ పార్టీ పోలింగ్‌ బూత్‌ కన్వీనర్‌గా ఉన్న వ్యక్తికి జనసేనలో పదవి కేటాయించడం వెనుక టీడీపీ మండల కన్వీనర్‌ సిఫారసే కారణమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ పేరుతో ఓ కొత్త కమిటీని ప్రకటించింది. 

ఈ కమిటీలో కొల్లూరుకు చెందిన ఈమని మణికంఠకు సాదక్‌ రిప్రజెంటేటివ్‌గా పదవి దక్కింది. అయితే గతంలో జనసేన కార్యకర్తగా ఉన్న మణికంఠ కొన్నేళ్లుగా టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్‌ మైనేని మురళీకృష్ణ ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆ పార్టీ సభ్యత్వాన్ని సైతం తీసుకున్నాడు. టీడీపీలో అతనిని కొల్లూరు 144వ పోలింగ్‌ బూత్‌కు కన్వీనర్‌గా సైతం ఆ పార్టీ సంస్థాగత పదవి కేటాయించింది. అయితే జనసేన పార్టీ నూతనంగా నియమించిన పార్లమెంట్‌ స్థాయి కమిటీలో టీడీపీ సభ్యుడైన మణికంఠకు పదవి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చానీయంశంగా మారింది. టీడీపీ కొల్లూరు మండల అధ్యక్షుడి అనుచరుడిగా మెలుగుతున్న మణికంఠకు జనసేనలో పదవి దక్కడం మైనేని చక్రం తిప్పాడనే చర్చ నడుస్తుంది. 

జనసేనకు మద్దతుగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలను, నాయకులను మభ్యపెట్టి టీడీపీ నాయకులు తమ వెంట తిప్పుకుంటూ మా పార్టీలో అంతర్గత పోరుకు ప్రోత్సహిస్తున్నారని స్థానిక జనసేన నేతలు వాపోతున్నారు. 2024 నుంచి టీడీపీ సభ్యత్వం పొంది, ఆపార్టీ బూత్‌ కన్వీనర్‌గా ఉన్న మణికంఠకు నేడు జనసేనలో పదవి రావడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు. జనసేన నాయకత్వంలో ముసలం పుట్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement