
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోకి బీజేపీని భాగస్వామిగా చేర్చుకుంటే.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఆ పని చేయటం తనకు ఇష్టం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.
అనంత్‌నాగ్ జిల్లాలోని అచబల్‌లో మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘మీరు (ప్రజలను ఉద్దేశించి) సిద్ధమైతే చెప్పండి.. ఈ వ్యాపారం (బీజేపీతో పొత్తు) చేయటం నాకు ఇష్టంలేదు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకోవటం అవసరమని మీరు అనుకుంటే ముందు నా రాజీనామాను ఆమోదించండి. మరో ఎమ్మెల్యే సీఎం అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బీజేపీతో పొత్తుకు నేను మాత్రం సిద్ధంగా లేను. మన ప్రభుత్వంలోకి బీజేపీని తీసుకొంటే మనకు ఒక బహుమతి లభించవచ్చు. వాళ్లు (కేంద్రం) మనకు త్వరలోనే రాష్ట్ర హోదా ప్రకటించవచ్చు’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వంలో కశ్మీర్‌కు మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్న వాదనను ఒమర్ అబ్దుల్లా తిరస్కరించారు. ‘ప్రభుత్వంలో పిర్‌పంజాల్‌కు ప్రాతినిధ్యం ఉంది. దిగువ జమ్ము ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. జమ్మూ నుంచి ఉపముఖ్యమంత్రి ఉన్నారు’ అని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను శాంతియుత, ప్రజాస్వామ్యయుత పోరాటాలతోనే సాధించుకుంటామని స్పష్టంచేశారు.