హంగు కాదు.. బీజేపీ డకౌట్‌ అవుతుంది: హరీష్‌ రావు | Sakshi
Sakshi News home page

హంగు కాదు.. బీజేపీ డకౌట్‌ అవుతుంది: హరీష్‌ రావు

Published Sat, Oct 7 2023 1:08 PM

Harish Rao Reacts On BL santhosh Hung Assembly Comments - Sakshi

సాక్షి, మంచిర్యాల: ఎవరు అవునన్నా.. కాదన్న.. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎన్నికల కోసం బీఆర్ఎస్ తీసుకురాబోయే మేనిఫెస్టో చూస్తే ప్రతి పక్షాల మైండ్ బ్లాక్ కావాల్సిందేనని అన్నారాయన.  శనివారం మంచిర్యాల పడ్తనపల్లి సభలో బీజేపీ, కాంగ్రెస్‌లపై హరీష్‌ రావు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోంది. ఫించన్లు, రైతు బంధు పెంపుపై కసరత్తులు చేస్తున్నాం. మేనిఫోస్టో చూస్తే మైండ్‌ బ్లాక్‌ కావాల్సిందే. ఎవరు ఏమన్నా.. తెలంగాణ బీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతుంది. మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని విజయంపై ధీమా వ్యక్తం చేశారాయన. 

కాంగ్రెస్‌ మత కల్లోలాలు రేపింది
తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో కర్ఫ్యూ లేదు.. కరువు లేదు. కాంగ్రెస్ మత కల్లోలాలు రేపింది, కళ్ల బొల్లి హామీలతో మళ్లీ ముందుకు వస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ ఓ భస్మాసుర హస్తం అని మండిపడ్డారాయన.

బీజేపీపై సెటైర్లు
తెలంగాణ బీజేపీ డకౌట్‌ ఖాయమన్నారు హరీష్‌రావు. ‘‘బీజేపీ నడ్డా వచ్చిండు, తెలంగాణ కేసీఆర్ అడ్డా అని నడ్డా గుర్తు పెట్టుకోవాలి, నీ సొంత రాష్ట్రంలోనే బీజేపీ ని గెలిపించు కోలేదు అని నడ్డాను ఉద్దేశించి విమర్శలు సంధించారు హరీశ్‌రావు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం పలికారాయన. బీజేపీ అనేక కమిటీలు వేసింది. చేరికల కమిటీ వేస్తే.. అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. వీటికి బదులు డిపాజిట్‌ దక్కించుకునే కమిటీ వేస్తోండి.. కనీసం పరువైనా దక్కుతుంది అని సెటైర్లు వేశారు హరీష్‌రావు. 

హంగ్ వస్తుందని బీఎల్ సంతోష్(బీజేపీ సీనియర్‌ నేత) అంటున్నారు. హంగ్ కాదు మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్‌ కొడతాం అని హరీష్‌ రావు అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరిన హరీష్‌ రావు.. క్యాడర్‌ను కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని తెలిపారు. 

Advertisement
 
Advertisement