బయటపడ్డ చంద్రబాబు నిజ స్వరూపం: మేరుగ | Ex Minister Merugu Nagarjuna Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బయటపడ్డ చంద్రబాబు నిజ స్వరూపం: మేరుగ

Dec 26 2024 9:53 PM | Updated on Dec 26 2024 10:01 PM

Ex Minister Merugu Nagarjuna Fires On Chandrababu

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన రూ.15,485 కోట్ల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన రూ.15,485 కోట్ల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్‌ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున  ఆక్షేపించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..:

కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు:
కూటమి ప్రభుత్వ పాలనంతా ‘బాదుడే బాదుడు’ అన్నట్లుగా మారింది. ‘ఓట్లేయండి తమ్ముళ్లూ.. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచం. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ’.. అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు. అన్ని వర్గాలకు వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరక్కుండానే యథేచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. సూపర్‌సిక్స్‌తో సహా, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఒక్క హామీపైనా త్రికరణ శుద్ధితో ఈ ప్రభుత్వం పని చేయడం లేదు.

ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలు:
విద్యుత్‌ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మరిచిపోయి ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. అలా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దీంతో విద్యుత్‌ గృహ వినియోగదారులపై 25 నుంచి 55 శాతం వరకు అదనపు వడ్డన చేస్తున్నారు.

ఎంత దారుణం అంటే.. ఇది శీతాకాలం. అంటే విద్యుత్‌ వాడకం తక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఇంత భారం మోపితే, ఇక వేసవి కాలంలో విద్యుత్‌ వాడకంపై ఎంత భారం పడుతుందో అర్థం కావడం లేదు. ఆనాడు జగన్‌ గారు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ  ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసింది. బిల్లులు చెల్లించాల్సిందేనంటూ వారిని వేధిస్తోంది. ఇప్పుడు తాజాగా అన్ని వర్గాలపైనే విద్యుత్‌ ఛార్జీల కొరడాను ఝుళిపిస్తోంది.

ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవంటూ అబద్దాలు:
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 195 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోత విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయం­త్రం, రాత్రి వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అయినా అధికారిక నివేదికల్లో విద్యు­త్‌ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తు­న్నారు. నిజానికి గతేడాది కంటే విద్యుత్‌ డిమాండ్‌ 1.17 శాతం తక్కువగా ఉన్నా, అది కూడా సరఫరా చేయలేక ప్రభుత్వం సన్నాయినొక్కులు నొక్కుతోంది. అదే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిండు వేసవిలోనూ, బొగ్గు సరఫరా సంక్షోభంలోనూ ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్‌  సరఫరా చేయడం జరిగింది.

బాబు జమానాలో సబ్సిడీలో కట్‌:
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైయస్సార్‌సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను సబ్సిడీగా అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదీ జగన్‌ కమిట్‌మెంట్‌.

విద్యుత్‌ ఛార్జీలపై పోరాటం:
చంద్రబాబులాగా హామీలు ఇవ్వడం, చేతులెత్తేయడం, పారిపోవడం శ్రీ వైయస్‌ జగన్‌కు తెలియదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల గురించి ఆయన ఆలోచించారు. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే ఛార్జీల భారం మోపుతోంది. విద్యుత్‌ ఛార్జీలపై ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ, వైఎస్సార్‌సీపీ రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మేరుగ నాగార్జున వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement