హోటల్స్‌లో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు
నోటీసులు ఇచ్చింది వీరికే...
● పాడై నిల్వ ఉంచిన 101 కిలోల
మాంసం సీజ్
● ఐదు రెస్టారెంట్స్‌కు నోటీసులు జారీ
గుంటూరు మెడికల్: రోజుల తరబడి వండకుండా నిల్వచేసిన మాంసం.. ఆహారం మిగిలిపోతే పడేయకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన దృశ్యాలు మంగళవారం గుంటూరు నగరంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు జరిపిన తనిఖీల్లో వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్లితే....గుంటూరు నగరంలో మంగళవారం ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్స్, తూనికలు, కొలతల శాఖ అధికారుల బృందాలుగా ఏర్పడి విస్తృతంగా హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్స్‌షాపులు, బేకరీలలో తనిఖీలు చేశారు. తనిఖీలలో వాళ్లకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చికెన్, మటన్, చేపలను వండకుండా ఫ్రిజ్‌లలో రోజుల తరబడి రెస్టారెంట్స్ నిర్వాహకులు నిల్వచేశారు. మాంసం ఐస్ గడ్డలాగా గట్టిగా మారిపోయి ఎంత పగులగొట్టినా ఐస్ ముక్కలు వస్తున్నాయే తప్ప మాంసం కనిపించలేదు. ఫ్రిజ్ అంతా రక్తంతో గడ్డకట్టుకుపోయి ఉంది. ఆహార పదార్థాలు వండే కిచెన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోపాటు అపరిశుభ్రంగా ఉంది. ఆహార పదార్థాల్లో సైతం నిషేధిత రంగులు కలిపి విక్రయిస్తున్నారు. పచ్చి మాంసమే కాకుండా వండిన అన్నం, బిర్యానీ, కూరలు కూడా ఫ్రిజ్‌లలో నిల్వ ఉన్నాయి. ఇలాంటి విస్తుపోయే నిజాలతో మైండ్ బ్లాక్ అయిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తక్షణమే ఆయా హోటల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
మాంసం సీజ్ చేసిన హోటల్స్,
రెస్టారెంట్స్ ఇవే...
గుంటూరు లక్ష్మీపురం రోడ్డులోని బిస్మిల్లా రెస్టారెంట్‌లో 48 కేజీల మాంసం, బృందాన్‌గార్డెన్స్ సెంటర్‌లోని స్వాగత్ డిలైట్‌లో 25 కేజీల మాంసం, గోంగూర రెస్టారెంట్‌లో ఐదు కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లోని సాయిరాం ఫుడ్స్‌లో మూడు రకాల స్వీట్లు 25కేజీల వరకు సీజ్‌చేసి పరీక్షల నిమితం స్టేట్ ఫుడ్‌సేఫ్టీ కార్యాలయానికి తరలించారు. ఏ మేరకు కల్తీలు ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చిన పిదప నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్‌సేఫ్టీ స్టేట్‌జాయింట్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు మీడియాకు తెలిపారు.
తనిఖీలు చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ ఇవే...
గుంటూరు నగరంలోని గోంగూర రెస్టారెంట్, మయూర్ ఫ్యామిలీ రెస్టారెంట్, స్వాగత్ డిలైట్, 99 బిర్యానీ, ఆల్ కబీర్ రెస్టారెంట్, నవాబ్ అరేబియన్ రెస్టారెంట్, బిర్యానీ ప్యాలెస్, మద్రాస్ బిలాల్ హోటల్, బాబు బిర్యానీ, నల్లపాడు సుభాని హోటల్, శుభం హోటల్. వీటితోపాటుగా సాయిరాం ఫుడ్స్, నగరాలు బాలాజీ స్వీట్స్, బ్రాడీపేట సుజనా బేకరీలలో తనిఖీలు చేశారు.
తనిఖీల్లో పాల్గొన్నవారు
ఫుడ్‌సేఫ్టీ డిపార్ట్‌మెంట్ స్టేట్ ఇన్‌చార్జి జాయింట్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నెల్లూరు అసిస్టెంట్‌ఫుడ్ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, 10 మంది ఫుడ్ సేఫ్టీఆఫీసర్లు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం పరిమితికి మించిన రంగులు కలిపి ఆహారం, ఆహార పదార్ధాలు తయారు చేయటం, వండిన పదార్థాలు రోజుల తరబడి నిల్వ చేయటం, పచ్చి మాంసాన్ని రోజుల తరబడి నిల్వ చేయటం, అపరిశుభ్రమైన వాతావరంణలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న స్వాగత్ డిలైట్, మద్రాస్ బిలాల్, బెంగళూరు అయ్యంగార్ బేకరీ, శుభం హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్న అరండల్‌పేట నాల్గోలైన్‌లోని ఆల్ కబీర్ రెస్టారెంట్ వారికి నోటీసులు ఇచ్చారు.


