కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేద్దాం  | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేద్దాం 

Published Sat, Nov 11 2023 3:33 AM

DK Shivakumar comments over kcr  - Sakshi

కోదాడ: పదేళ్లుగా సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌ నుంచే పాలన సాగించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావును డిసెంబర్‌ తరువాత శాశ్వతంగా ఫాంహౌస్‌కే పరిమితం చేద్దామని కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన రోడ్‌ షో, రంగా థియేటర్‌ సెంటర్‌లో జరిగిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరున్న కేసీఆర్‌ సర్కారును ఇంటికి పంపడానికి ప్రజలు నవంబర్‌ 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

‘డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్రం ఇ చ్చిన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం. ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమెకు పుట్టినరోజు కానుకగా ఇవ్వబోతున్నాం’అని పేర్కొన్నారు. 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదని, సాగర్‌ ఆయకట్టు ప్రాంతంగా ఉన్న కోదాడకు రావడం, ఇక్కడ రైతులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను టీఆర్‌ఎస్‌ నాయకులు వచ్చి చూడాలని సూచించారు.

రూ.లక్షన్నర కోట్ల అప్పులు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ మూడేళ్లకే కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ కోట్లాది రూపాయలు దోచుకున్నారని శివకుమార్‌ ఆరోపించారు. జాతీయస్థాయిలో పేరున్న ఉత్తమ్‌ను హుజూర్‌నగర్‌లో, ఆయన సతీమణి పద్మావతిని కోదాడలో గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ కాంగ్రెస్‌ నేతలు రఘువీరారెడ్డి, రుద్రరాజు, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, కోదాడ కాంగ్రెస్‌ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు పాల్గొన్నారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement