పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు | Disputes erupt in TDP, Jana Sena over selection of Rajya Sabha candidates | Sakshi
Sakshi News home page

పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు

Jun 8 2026 4:17 AM | Updated on Jun 8 2026 4:17 AM

Disputes erupt in TDP, Jana Sena over selection of Rajya Sabha candidates

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు

తనకు అన్యాయం జరిగిందని ట్వీట్‌ చేసిన కడప నేత శ్రీనివాసరెడ్డి 

వర్ల రామయ్యకు మరోసారి మొండిచేయిపై దళిత నేతల అసంతృప్తి 

తమ సీనియారిటీకి విలువ ఏదని యనమల, కంభంపాటి ఆవేదన 

తండ్రికి స్పీకర్‌ పదవి.. కుమారుడికి రాజ్యసభ సీటుపై క్యాడర్‌లో అసహనం 

రాజ్యసభకు పంపడానికి ఒక్క మహిళ కూడా దొరకలేదా? అని మహిళా లోకం ఆవేదన   

లాబీయిస్టులు, కార్పొరేట్‌ శక్తులకే చంద్రబాబు పట్టం గట్టారని పార్టీ వర్గాల మండిపాటు 

పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి పదవులపై జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి  

సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేనలో కాక రేపుతోంది. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు రగిలిపోతుండగా.. జనసేనలో పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని మరోసారి తేటతెల్లమైందని, ఇలాగైతే పార్టీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అత్యధిక చోట్ల ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలకే సీట్లు దక్కాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. లాబీయిస్టు సానా సతీష్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్‌కి పదవుల పందేరంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు సీనియర్‌ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతూ ఆదివారం ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. 

13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసినా రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీలో దళిత సామాజికవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిసారీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో వర్ల రామయ్య పేరును తెరపైకి తేవడం చివరకు సామాజిక సమీకరణాల పేరుతో పక్కనపెట్టి అవమానించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అనే విషయం మరోసారి రుజువైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకపోగా పదవుల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రామయ్య సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. 

యనమల గుర్రు.. కంభంపాటి కస్సు..! 
సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి బాధ వర్ణనాతీతమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పెద్దల సభకు పంపాలని పదేపదే ప్రాథేయపడినా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై యనమల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నారా లోకేష్‌ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ధన బలం ఉన్న వారిని పార్టీ నేతలుగా చిత్రీకరించి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహనరావు సైతం తనను అవమానించారని ఆవేదనతో రగిలిపోతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని అయినప్పటికీ పదవుల విషయంలో వంచించారని ఆయన వాపోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, ఎంఏ షరీఫ్‌ తదితర నేతలు సైతం తమకు అన్యాయం చేశారని నైరాశ్యంలో కూరుకుపోయారు. 

ఒక్క మహిళా కనపడలేదా? 
మూడు స్థానాల్లో టీడీపీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని మహిళా లోకం నిలదీస్తోంది. మహిళల కోసమే టీడీపీ ఉందని మహానాడులో తీర్మానాలు చేసి తీరా రాజ్యసభ సీటు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు.  

కార్పొరేట్‌ వైపే మొగ్గు.. 
తన కుమారుడి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న సానా సతీష్‌కి మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తాను లాబీయిస్టుల వైపే మొగ్గు చూపుతానని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సతీష్‌ వివాదాస్పద వ్యక్తి అని, అతడితో కలిసి తిరిగితే జనం ఏమనుకుంటారని ఎల్లో మీడియాకు చెందిన ఏబీఎన్‌ రాధాకృష్ణ తన తొలి పలుకులో ప్రశ్నించారు. టీడీపీలో సీనియర్లంతా వ్యతిరేకించినా సతీష్‌కు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి ఆయన రాజ్యసభకు పంపుతుండటాన్ని బట్టి తమ బంధం ఎంత బలమైందో రుజువు చేశారు. 

భాష్యం రామకృష్ణ కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నా ఆయనకే అవకాశం ఇవ్వడం ద్వారా కార్పొరేట్‌ శక్తులంటే తనకు మక్కువని చంద్రబాబు తేల్చేశారు. ఇక స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్‌ దురహంకారి కావడంతో పార్టీలో ఆయన పట్ల పూర్తి ఆమోదం లేదు. అందుకే పార్టీ సోషల్‌ మీడియా విభాగం బాధ్యతల నుంచి చాలాకాలం క్రితమే ఆయన్ను తప్పించారు. అయితే లోకేష్‌కి సన్నిహితుడు కావడం, ధన బలం ఆధికంగా ఉండడంతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని తరచూ చెబుతూ తండ్రికి స్పీకర్‌ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని టీడీపీలో ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.  

నాలుగింటిలో రెండు సొంత వర్గానికే.. 
కూటమి తరఫున నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతుండగా రెండు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలోనూ వినిపిస్తోంది. జనసేన తరఫున సీటు పొందిన లింగమనేని, టీడీపీ తరఫున సీటు దక్కించుకున్న భాష్యం రామకృష్ణ.. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఆయనకు సన్నిహితులనే విషయం తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి.   

విజయ్‌ సత్తా చూశాకైనా మారకుంటే ఎలా? 
జనసేన అంటే టీడీపీకి బీ టీమ్‌ అని ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా పార్టీకి దక్కిన రాజ్యసభ సీటును సైతం చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తికే కేటాయించడం పట్ల జన సైనికుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి ఓ బడా వ్యాపారవేత్తను పెద్దల సభకు పంపడం వెనుక అంతర్యమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.  ఉత్తరాంధ్ర, కోస్తాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతల్లో ఎవరికైనా ఆ పదవి ఇచ్చి ఉంటే జనసేన క్యాడర్‌ చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. ‘కష్టపడేవారికి గుర్తింపు లేకుండా.. పైరవీలు, ఆర్థిక అండదండలు ఉన్నవారికే పదవులు కట్టబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు? ఇలాగైతే జనసేన బలపడేదెలా?’ అంటూ పార్టీ సీనియర్‌ నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రెండేళ్లలోనే అధికారంలోకి రాగలిగిన సీఎం విజయ్‌ ఎక్కువగా కొత్త వ్యక్తులకే అవకాశం కల్పించారని.. దళపతి సత్తా, ఆ పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం చూసిన తర్వాత కూడా పవన్‌కళ్యాణ్‌ మారకపోతే ఎలా? అని జనసేన సైనికులు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement