
ఏఐసీసీ పెద్దల చుట్టూ కాంగ్రెస్ నేతల ప్రదక్షిణలు
ఇటు ఇతర పార్టీల నేతల కోసం టీపీసీసీ ఎదురుచూపులు
మూడు, నాలుగు చోట్ల వలస నేతలకు అవకాశం
మూడు సీట్లు బీసీలకు?
ప్రస్తుతానికి దీపాదాస్ మున్షీ వద్ద ఆగిన బంతి
త్వరలోనే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ.. ఆ తర్వాత సీఈసీ సమావేశంలో ఖరారు
రాష్ట్రం నుంచి రాహుల్ పోటీపై పార్టీలో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఢిల్లీ చుట్టూ.. ఇటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇతర పార్టీల కంటే ముందే ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు రేసులో మాత్రం కొంత వెనుకబడి నట్టు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీలు చాపకింద నీరులా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందుకెళుతుంటే కాంగ్రెస్‌లో మాత్రం కొంత డైలమా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి పెద్ద చేపలు తమ గాలానికి చిక్కుతాయనే ఆలోచనతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పోటీ కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.
కాగా, టికెట్ల విషయమై త్వరలోనే ఢిల్లీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత స్పష్టత వస్తుందనీ, ఆ తర్వాత సీఈసీ సమావేశంలో ఖరారయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో సరైన సమయంలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. కాగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ సీట్లకు టికెట్ల ఎంపిక, అభ్యర్థిత్వాల పరిశీలనపైనే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
కొత్త నేతలకు అవకాశమిస్తారా?
ఇటీవలే పార్టీలో చేరిన కొందరు నేతలకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఇస్తారనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ జాబితాలో బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజ్‌గిరి), పట్నం సునీతా మహేందర్‌రెడ్డి (చేవెళ్ల), నీలం మధు ముదిరాజ్ (మెదక్), తాటికొండ రాజయ్య (వరంగల్) పేర్లు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్, చేవెళ్ల విషయంలో అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయనే చర్చ కూడా జరుగుతోంది. మల్కాజ్‌గిరి సీటు కోసం దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది.
ఆయన త్వరలోనే పార్టీలోకి వస్తున్నారని, ఆయనతో పాటు సినీ నిర్మాత బండ్లగణేశ్, కొందరు ఇతర నాయకుల పేర్లను పరిశీలిస్తారని అంటున్నారు. ఇక, మెదక్ విషయంలో మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా రేసులో ఉండడం గమనార్హం. వరంగల్ విషయానికి వస్తే అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి నుంచి తాటికొండ రాజయ్యతో పాటు జిల్లా రిజి్రస్టార్ హరికోట్ల రవి, దొమ్మాటి సాంబయ్య, సింగాపురం ఇందిర, అద్దంకి దయాకర్, డాక్టర్. ఆర్. పరమేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే నాగర్‌కర్నూల్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలను ఏ సామాజిక వర్గానికి ఇస్తారన్న దాన్ని బట్టి వరంగల్‌లో అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలున్నాయి. నాగర్‌కర్నూల్ నుంచి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డాక్టర్ చారగొండ వెంకటేశ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ, సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకాని, పెర్క శ్యాంకుమార్‌లో ఒకరికి అవకాశం దక్కే చాన్సుంది.
ఐదు రిజర్వుడు, మూడు బీసీ, ఒకటి మైనార్టీకి
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు ఎస్సీలకు, రెండు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఇవి పోను మిగిలిన 12 స్థానాల్లో మూడు స్థానాలను బీసీలకు ఇస్తారని, ఒక్క స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తారని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన 8 చోట్ల జనరల్ అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు సమాచారం. బీసీలకిచ్చే స్థానాల్లో మెదక్, జహీరాబాద్, సికింద్రాబాద్ ఉంటాయని తెలుస్తోంది. హైదరాబాద్ లోక్‌సభకు మైనార్టీ నేతను పోటీ చేయిస్తారని, హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సమీర్‌వలిఉల్లాకు సీటు దక్కే అవకాశం ఉందని సమాచారం.
ఈయనతో పాటు ఫిరోజ్‌ఖాన్, అలీ మస్కతి లాంటి సీనియర్ల పేర్లు కూడా మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నాయి. మిగిలిన స్థానాల విషయానికి వస్తే వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పటేల్ రమేశ్‌రెడ్డి, జానారెడ్డి ( నల్లగొండ), చామల కిరణ్‌రెడ్డి, కుంభం కీర్తిరెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి పవన్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, పున్నా కైలాశ్‌నేత, చనగోని దయాకర్ (భువనగిరి), సురేశ్òÙట్కార్ (జహీరాబాద్), వీహెచ్, జెట్టి కుసుమకుమార్, పొంగులేటి ప్రసాదరెడ్డి, మల్లునందిని, వి.వి.రాజేంద్రప్రసాద్ (ఖమ్మం), పెద్దిరెడ్డి, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రుద్ర సంతోశ్ (కరీంనగర్), టి.జీవన్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి, ఈరవత్రి అనిల్ (నిజామాబాద్), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్. శంకర్‌నాయక్, విజయాబాయి (మహబూబాబాద్), నరేశ్ జాదవ్, రేఖానాయక్ (ఆదిలాబాద్) పేర్లు వినిపిస్తున్నాయి.
రాహుల్ వచ్చేనా?
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తారనే అంశంపై గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేరళలోని వాయనాడ్ స్థానంలో ఇండియా కూటమి నుంచి సీపీఐ పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రాహుల్‌గాంధీ కర్ణాటక లేదా తెలంగాణ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. గతంలో కూడా సోనియా, ప్రియాంకాగాంధీ తెలంగాణలో పోటీ చేస్తారని, సోనియాగాం«దీని తెలంగాణ నుంచే రాజ్యసభకు ఎంపిక చేస్తారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా రాహుల్ పేరు తెరపైకి రావడం గమనార్హం. ఒకవేళ ఆయన తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే ఖమ్మం లేదా నల్లగొండ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment