
19, 20 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బట్టబయలు చేస్తా
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన పాపాలు చెబుతా
ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే.. అసలు సినిమా ముందుంది
శివునిపల్లి ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు
ఇప్పుడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది
రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరంగా మారింది
రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా ఎన్నికల్లో ఇచి్చన హామీలు అమలు చేస్తున్నామన్న సీఎం
ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలంటూ సవాల్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా విప్పుతా..19, 20 తేదీల్లో బట్టబయలు చేస్తా. ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే...అసలు సినిమా ముందుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేతుల బెడితే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. అప్పులకు అసలు, మిత్తీ కలిపి ఏడాదిలో రూ.1.53 లక్షల కోట్లు మా ప్రభుత్వం కట్టింది.
ఆ డబ్బే ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ శివారు శివునిపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
అప్పుల్లోనే పథకాల అమలు
‘కేసీఆర్ పాలించిన ఆ పదేళ్లలో ధనిక రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. ఆనాడు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.500 కోట్ల అప్పు ఉంటే ఈనాడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో రూ.8.29 లక్షల కోట్లు అప్పు తేలింది. అయినా అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశాం.
ఈ మహాలక్ష్మి పథకంతో నేటికి 150 కోట్ల మంది ఆడబిడ్డలకు గాను రూ.5,005 కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలి
‘కృష్టా, గోదావరి జలాల ప్రాజ్టెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయి కూలేశ్వరంగా మారింది. తాటిచెట్టులా పెరిగిండ్రు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివి లేదు.. నేను హరీశ్‌రావుకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు రావాలి.
300 టీఎంసీలతో శ్రీరాంసాగర్, 200 టీఎంసీల నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు జూరాల, నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్, ఇందిరాసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి పక్కా శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పారదర్శక పాలనకు అద్దం పడతాయి. కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో సాగునీరు రాకున్నా కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేలా తోడ్పాటు అందించాం. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. ఈ విషయాలపై విమర్శలు చేస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్ పిల్లకాకులు. కేసీఆర్‌ను రమ్మన్నా..ఏ ప్రాజెక్టు వద్ద మాట్లాడుదాం రమ్మంటున్నా..’ అని రేవంత్ అన్నారు.
జనగామ జిల్లా శివునిపల్లిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు ∙సభకు హాజరైన మహిళలు
ఫామ్‌హౌస్‌లో పడుకొని ఉసిగొల్పుతుండు..
‘అధికారం పోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకొని ఉసిగొల్పుతుండు. అందుకే ఫామ్‌హౌస్‌లో నుంచి లేచి రమ్మన్నా. రూ.58 లక్షల ప్రజాధనం జీతభత్యాల కింద తీసుకున్నారు. ఏ రంగంలో జీతగాళ్లకైనా పని చేయకుంటే జీతం ఇస్తారా? అపార రాజకీయ అనుభవజు్ఞడైన కేసీఆర్ అ«ధికారం ఉంటే వస్తరు.. లేకుంటే అలిగి పండ్తరా? మీరైతే లక్షల కోట్లు సంపాదించి ఫామ్‌హౌస్‌లు, టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు.
నువ్వు గజ్వేల్, నీ కొడుకు జన్వాడ, నీ అల్లుడు మొయినాబాద్, నీ బిడ్డ శంకర్‌పల్లిలో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నరు. కానీ తెలంగాణ రైతులు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరు క్యాప్సికమ్ పండించి కోట్లు సంపాదించిన తీరు వారికి, నిరుద్యోగ యువతకు చెప్పరా? అధికారం పోగానే దివిసీమ తుపాను బాధితుల కంటే ఎక్కువ ఆందోళనలో కేసీఆర్ కుటుంబం ఉంది.
కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని హరీశ్‌రావు అంటున్నడు. జాతిపితకు, కేసీఆర్‌కు ఏమైనా పోలిక ఉందా? అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. హరీశ్‌రావు చెప్పే జాతిపిత ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నారు. తెలంగాణ జాతిపితలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్..’ అని సీఎం పేర్కొన్నారు.
మా మీద ప్రజలకు కోపం ఎందుకుంటుంది...
‘ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్లే పయనంలో మహిళల అభ్యున్నతికి పాటు పడుతుంటే మాపై ప్రజలకు కోపం ఉందని చెబుతున్నారు. మాపై కోపం ఎందుకు ఉంటుంది? 65 లక్షల మందికి సారెచీర ఇచ్చినందుకా? వెయ్యి సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారీతో శ్రీమంతులు చేసినందుకా? రూ.20,617 కోట్ల పంట రుణమాఫీ చేసినందుకా? రూ.500 బోనస్ ఇస్తూ రైతు భరోసా రూ.12 వేలకు పెంచినందుకా? మీడియా మిత్రులకు ఇళ్లపట్టాలు ఇచ్చినందుకా?..’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దొంగలకు ఉప్పు పాతర వేస్తా అన్నందుకు దోపిడీ వర్గాలకు నాపై కోపం ఉంటుంది తప్ప ప్రజలకు ఉండదన్నారు.
దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి
‘గత బీఆర్‌ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావట్లేదన్నారు.
సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, రామచంద్రునాయక్, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.