
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలకు మాత్రమే వర్గీకరణ ఉంటుందని, ఆయన(కిషన్ రెడ్డి) చెప్పినట్లు ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లేం లేవని అన్నారాయన.
ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదు. బీసీ మొత్తానికి కలిపి 42 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవు.
కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు. బీసీఈ గ్రూపుకు ఇప్పటికే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.
రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ ఉద్ఘాటించారు. ‘‘బీసీ రిజర్వేషన్‌లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్‌మెంట్. మా కమిట్మెంట్‌కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. జంతర్ మంతర్ వేదికగా మావాయిస్ బలంగా వినిపించాం. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టడం బీఆర్‌ఎస్ నైజం.
లోకల్‌బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు.