గ్రామాల్లో నూతన పాలకవర్గాలకు కొత్త సవాళ్లు
అధికారాలతోపాటు బాధ్యతలు పెరగడం కత్తి మీద సామే...
రెండు నెలలకోసారి కచ్చితంగా గ్రామసభ నిర్వహించాలి
పీఆర్ చట్టంలో పచ్చదనం, పారిశుధ్యం, ఇతర లక్ష్యాలు
ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టంగా చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గాలకు కొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరగడంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఇది కత్తి మీద సాముగా మారే ప్రమాదముంది. గతంలో సర్పంచ్ అనగానే అధికారాలే తప్ప విధులు, బాధ్యతలు పెద్దగా ఉండేవి కాదు. అయితే, నూతన పంచాయతీరాజ్ చట్టం–2018లో అనేక లక్ష్యాలు, బాధ్యతలు నిర్దేశించారు. వీటిని సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచుల తొలగింపుతోపాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశాన్ని నూతన చట్టంలో కల్పించారు.
పాలకవర్గాలు గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొత్త చట్టంలో సర్పంచులకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతోపాటు ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల పురోగతికి, వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లతోపాటు వార్డుమెంబర్లను కూడా భాగస్వాములను చేశారు. పచ్చదనం పరిరక్షణ, మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటివి ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి.
బాధ్యతలెన్నో...
ప్రతీ గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతీ కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యతను కూడా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌పై ఉంచారు. రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించి గ్రామంలోని సమస్యలపై చర్చించాలి. మూడు పర్యాయాలు వరుసగా గ్రామసభల నిర్వహణలో విఫలమైతే సర్పంచ్‌ను బాధ్యతల నుంచి తొలగించే నిబంధన ఉంది. పాలకవర్గాలు ప్రతి నెలా సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించాల్సి ఉంటుంది. గ్రామాల్లో, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమాని నుంచి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని కల్పించారు. మురుగునీటిని పైప్‌ద్వారా రోడ్డు మీదకు వదిలితే రూ.5,000 జరిమానా విధిస్తారు. గ్రామంలోని ఒక్కో కుటుంబం ఆరు మొక్కలు నాటాలని నిర్దేశించగా, అందుల్లో కనీసం మూడింటినైనా వారు నాటాలి. సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శి కూడా సంబంధిత గ్రామంలోనే నివాసం ఉండాలి. సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించినా, పాలకవర్గాలను రద్దు చేసినా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. పంచాయతీ పరిధిలోని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నూతన చట్టంలో వీలు కల్పించారు.
అక్రమ లేఅవుట్లపైనా చర్యలు
పంచాయతీలు అక్రమ లేఅవుట్లకు అనుమతినిస్తే మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇదే రీతిలో కఠిన చర్యలుంటాయి. పంచాయతీలు మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీ ప్లస్ టు భవనాల నిర్మాణాలకే అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాల్సి ఉంటుంది.
నూతన చట్టం ప్రకారం ప్రతీ పంచాయతీలో...మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు; అభివృద్ధి పనులకు; వీధి దీపాల నిర్వహణకు; డంపింగ్ యార్డు, పారిశుధ్యం, శ్మశానాల నిర్వాహణకు ఇలా మొత్తం నాలుగు స్టాండింగ్ కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలకు నలుగురు వార్డుమెంబర్లు చైర్మన్లుగా ఉంటారు. ఇందులో మిగతా వార్డు సభ్యులతోపాటు గ్రామంలో ఉత్సాహంగా పనిచేసే యువత, మహిళా సంఘాల సభ్యులను కూడా భాగస్వాములను చేశారు.


