ఎన్నికల వ్యవస్థలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ ఆందోళన | BRS urges ECI to enforce one person one vote during SIR | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యవస్థలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ ఆందోళన

Jun 24 2026 10:00 PM | Updated on Jun 24 2026 10:00 PM

BRS urges ECI to enforce one person one vote during SIR

సాక్షి,హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓట్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దేశం - ఒక పౌరుడు - ఒకే ఓటు అనే ఆలోచన మేరకు వారి  ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం అనే లక్ష్యంతోనే భారత రాష్ట్ర సమితి ఈ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల పవిత్రతకు విఘాతం కలిగించే బోగస్, నకిలీ ఓట్ల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు.

డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల అసలు తీర్పును వక్రీకరించే ప్రమాదం కలిగిస్తారని డా. శ్రవణ్ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టినప్పటికీ, ఒక రాష్ట్రంలో ఓటు హక్కు కొనసాగిస్తూ మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా నమోదైన వారిని గుర్తించి తొలగించే స్పష్టమైన విధానం ఇప్పటికీ లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

హైదరాబాద్ నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తున్న అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగిందని ఆయన చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది తమ స్వరాష్ట్రాల్లో ఓటు హక్కును కొనసాగిస్తూనే తెలంగాణలో కూడా ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అటువంటి నమోదులను గుర్తించి తొలగించడంలో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని డా. శ్రవణ్ అన్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ పాత ఓటు నమోదులను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉందన్నారు. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఉమ్మడిగా పని చేస్తూ రెండు రాష్ట్రాల ఓటరు జాబితాలను పరస్పరం పరిశీలించాలని సూచించారు.

ఒక రాష్ట్రంలో నమోదైన ఓటరు మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా ఉన్నట్లయితే అలాంటి నమోదులను గుర్తించి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలు కలిసి పనిచేసి ఓటరు జాబితాలను పరస్పరం సరిపోల్చి, క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ నమోదులను తొలగిస్తేనే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు.

అదేవిధంగా ఈ ప్రక్రియను కేవలం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీహార్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా తెలంగాణలో నివసిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించే జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన “ఒక దేశం – ఒక పౌరుడు – ఒకే ఓటు” అనే సిద్ధాంతాన్ని డా. శ్రవణ్ ప్రస్తావించారు. ఒక దేశంలో ప్రతి పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రమని పేర్కొన్నారు. ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు హక్కు ఉండాలి తప్ప రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కొనసాగకూడదని స్పష్టం చేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటు నమోదులు ఉండటం, తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు కావడం, బోగస్ ఓటు వేయడం చట్టరీత్యా నేరమని డా. శ్రవణ్ గుర్తు చేశారు. అలాంటి నేరాలకు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై చాలా మందికి సరైన అవగాహన లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బోగస్ ఓట్లు కలిగి ఉండటం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కేవలం రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లే కాకుండా, ఒకే రాష్ట్రంలోని వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన డూప్లికేట్ ఓట్లను కూడా గుర్తించి తొలగించాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి ఒక నియోజకవర్గంలో కాకుండా రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉండే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి నమోదులను గుర్తించి రద్దు చేయడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.

ఒకే నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన నకిలీ ఓట్లు ,అన్నింటినీ సమగ్రంగా గుర్తించి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీలో కలిసి కూడా తమ వాదనను వినిపిస్తామని డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, ఓటు పవిత్రత కోసం భారత రాష్ట్ర సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement