కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు నరకం | BRS Leader KTR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు నరకం

Jun 27 2026 2:41 AM | Updated on Jun 27 2026 2:41 AM

BRS Leader KTR Fires On Congress Govt

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ సీఎం కావడం ఖాయం: కేటీఆర్‌ 

పరిగిలో పార్టీ శ్రేణులకు ‘సర్‌’పై అవగాహన  

పరిగి: ‘మోసపోతే గోస పడుతామని పరిగి గడ్డపై నిలబడి కేసీఆర్‌ ఆనాడే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజలు నరకం చూస్తున్నారు’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్‌ జిల్లా పరిగిలో ‘సర్‌’పై నిర్వహించిన శిక్షణ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్‌ రైతులకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్‌.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల పేరిట వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. పంటలకు బోనస్‌ ఇస్తామని చెప్పి కనీసం ధాన్యం కూడా పూర్తిగా కొనలేకపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపం లాంటివారని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.  

కమీషన్ల కోసమే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌.. 
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్‌ఎస్‌ హయాంలో 90 శాతం పూర్తి చేశామని.. కానీ రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్‌ నిలదీశారు. ఉద్దండాపూర్‌ నుంచి గ్రావిటీ ద్వారా వికారాబాద్‌ జిల్లాకు కాల్వల ద్వారా నీటిని తీసుకురావచ్చని సిద్ధం చేస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ. 440 కోట్ల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పక్కన పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం, కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని.. రైతులకు పరిగితోపాటు కొడంగల్, జిల్లా మొత్తానికి సాగు నీరు అందించే బాధ్యత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పార్టీ నేతలు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, శివనోళ్ల భాస్కర్, రాజిరెడ్డి, సురేందర్, అశోక్‌కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement