జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓటర్ ఐడీలు! ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు | BRS Harish Rao Complaint EC Over Jubilee Hills bypoll Fake Voter IDs Issue | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓటర్ ఐడీలు! ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

Nov 10 2025 2:29 PM | Updated on Nov 10 2025 3:56 PM

BRS Harish Rao Complaint EC Over Jubilee Hills bypoll Fake Voter IDs Issue

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌  ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్‌ పార్టీ జనాలను రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని.. కానీ, ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేసింది. 

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. లక్షకు పైగా చీరలతో పాటు మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించడం జరిగింది. కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. అందుకేనేమో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌ని కోరాం. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. 

.. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చాం. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమర్పించాం. 

ఓటర్ ఐడీ గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూతులకు పంపించకూడదు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారు. ఫేక్ ఐడీ కార్డుల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని కోరాం. ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం.. ఫేక్ ఐడీ కార్డుల వివరాలను అందించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధికారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

యూసుఫ్‌గూడాలో కాంగ్రెస్ కార్యాలయంను ఆనుకునే పోలింగ్ బూత్ ఉంది. కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారు?. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. 

సీఎం రేవంత్‌పై సెటైర్లు
ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై రివ్యూ పెట్టడానికి టైం దొరకలేదు. ఈరోజు 6 గ్యారంటీలపై రివ్యూ పెట్టడం ఎందుకు?. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడు. ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమే..

.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా లాభం లేదు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు. తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు’’ అని హరీష్‌రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement