
సాక్షి, అమరావతి: కార్మికుల హక్కులను కూటమి సర్కార్ కాల రాస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పని గంటలు 8 నుండి 12 గంటలకు పెంచటంపై తాము ప్రశ్నించామన్నారు. అంత హడావుడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదన్న బొత్స.. ఎంతో కాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మహిళల రక్షణపై కూడా ఈ బిల్లులో క్లారిటీ లేదు. దీనిపై మేము వాకౌట్ చేశాం. జీఎస్టీపై మేము మాట్లాడుతుంటే మాట్లాడనివ్వటం లేదు. కనీసం మా సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వం తీసుకోలేదు. చపాతీ, రోటీకి జీఎస్టీలేదన్నారు. మరి ఇడ్లీ, దోశకు ఉందా? అని అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.
..ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడమని చెప్పాం. చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకు మీద జీఎస్టీని తొలగించమని అడిగితే ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ను మేము చదివి వెళ్లిపోవాలన్నట్టుగా వారు చూస్తున్నారు’’ అని బొత్స దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు