
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) తప్పుడు ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పు కేవలం 2,61,683 కోట్లు మాత్రమే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు, ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో అప్పులు 10-14 లక్షల కోట్లు అని టీడీపీ, జనసేన, పచ్చ మీడియా గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(payyavula keshav) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ హయాంలో 2,61,683 కోట్లు మాత్రమే అప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉన్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. కాగా, చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక, కార్పోరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో 1,09,217 కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మొత్తంగా 3,70,900 కోట్లు అప్పులు తెచ్చినట్టు ప్రకటించారు. మరోవైపు.. 2024 ఎన్నికలు సమయంలో తెచ్చిన అప్పు సైతం ఇందులో కలిపి ఆర్థిక శాఖ లెక్కలను తాజాగా మంత్రి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: డొల్ల మాటలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు!
అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో టీడీపీ, పవన్(Pawan Kalyan) కల్యాణ్ తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ హయాంలో 10 నుండి 14 లక్షల కోట్లు అప్పు చేసినట్టు పచ్చ మీడియా, చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల ఫేక్ ప్రచారం బట్టబయలు అయ్యింది.
