ఆయన వెళ్లడానికి రెడీ.. ప్రజలు పంపడానికి రెడీ | AICC president Mallikarjuna Kharge comments on KCR | Sakshi
Sakshi News home page

ఆయన వెళ్లడానికి రెడీ.. ప్రజలు పంపడానికి రెడీ

Nov 18 2023 2:25 AM | Updated on Nov 18 2023 2:26 AM

AICC president Mallikarjuna Kharge comments on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తాము ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళితే.. ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు ముందే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్‌ వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారని, ఆయనను సాగనంపడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. ఎలాగూ సీఎం కేసీఆర్‌ కూడా రిటైర్‌మెంట్‌ రోజులొచ్చాయని, ప్రజలు ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటానని అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌కు బై బై, టాటా చెప్పి సాగనంపాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్‌ పార్టీ త్యాగం చేసి తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ సీఎం కుర్చీలో కూర్చుని, రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను టీపీసీసీ నేతలతో కలసి ఖర్గే ఆవిష్కరించారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాం. ఈ మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ వంటిది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుంది. మా పార్టీ నేతలంతా ఐక్యంగా ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోను అమలు చేస్తారు. ఎలాంటి సందేహం అవసరం లేదు. 

అధికారం కాంగ్రెస్‌కే.. 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అనేక తప్పులు చేసింది. కొంతకాలం కిందటి వరకు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఎన్నికల సమయంలో స్వరం తగ్గించారు. బీఆర్‌ఎస్‌ను దేశమంతటా విస్తరిస్తానని చెప్పిన కేసీఆర్‌.. మహారాష్ట్ర వరకు వెళ్లారు. మోదీ వద్దనడంతో ఆగిపోయారు. మోదీ, కేసీఆర్‌ కలసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. 

కర్ణాటకకు వచ్చి చూడండి 
కాంగ్రెస్‌ కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం లేదంటూ కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మేమిచి్చన గ్యారంటీలన్నీ అమలవుతున్నాయి. కావాలంటే వచ్చి చూసుకోండి. దేవుడి పేరు మీద ఓట్లడిగే పార్టీ మహిళలకు ఏమీ చేయలేకపోయింది. అదే కాంగ్రెస్‌ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో.. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించి దేవాలయాలు దర్శించుకుంటున్నారు. 

అమలు చేయకుంటే.. కేబినెట్‌లో మార్పు! 
ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఖర్గే.. ఈ సమయంలో కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి కేబినెట్‌ సమావేశంలోనే మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మీ వల్ల కావడం లేదని, కేబినెట్‌లో వేరే వాళ్లని తీసుకోవాలని నేను చెప్పాల్సి వస్తుంది’’అని పేర్కొన్నారు. 

దమ్ముంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ తేవాలి 
ప్రధాని మోదీ చెప్పినవేవీ అమలు కావు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ అంతే. ఎస్సీల్లోని మాదిగ, మాల ఉపకులాలకు ఏమేం కావాలో అన్నీ కాంగ్రెస్‌ పార్టీ ఇచి్చంది. దేశంలో ఎవరికి ఏం కావాలో అన్నీ చేసేది కాంగ్రెస్‌ పారీ్టనే. మా పార్టీ అమలు చేసే సమయంలో మోదీ పుట్టి కూడా ఉండరు. కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చి పదేళ్లయింది. ఎస్సీ వర్గీకరణ చేస్తానంటే ఇన్ని రోజులు ఆయనను ఆపిందెవరు? మోదీ ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చేయలేదు. ఇప్పుడు వర్గీకరణ విషయంలోనూ మోదీ చెప్పేది చేయరు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, పూర్తి మెజార్టీ కూడా ఉంది. దమ్ముంటే ఎస్సీ వర్గీకరణపై రేపే ఆర్డినెన్స్‌ తెచ్చి అమలు చేయాలి..’’అని ఖర్గే సవాల్‌ చేశారు. 

పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది: రేవంత్‌ 
ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తాము తెలంగాణ ప్రజలకు హామీ పత్రం ఇస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి, నమ్ముకున్న వారికి ద్రోహం చేస్తూ పరిపాలించడంతో.. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాకపోగా మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పదేళ్లు కేసీఆర్‌కు అవకాశమిచ్చారని, ఈసారి కాంగ్రెస్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాను రాబోతోందని, సునామీ సృష్టించబోతోందని పేర్కొన్నారు. 

ప్రజా ప్రభుత్వం వస్తుంది: భట్టి 
తెలంగాణ సంపదను ప్రజలకు పంచిపెట్టాలనే ఆలోచనతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇది తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల హయాంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా మేనిఫెస్టో తయారు చేశామని, తెలంగాణ ప్రజల బంగారు భవిష్యత్తుకు ఇది బాట వేస్తుందని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సీనియర్‌ నేతలు వీహెచ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, జెట్టి కుసుమకుమార్‌ తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement