యాడ్‌.. మార్చేనా పబ్లిక్‌ మూడ్‌!  | Sakshi
Sakshi News home page

యాడ్‌.. మార్చేనా పబ్లిక్‌ మూడ్‌! 

Published Mon, Nov 20 2023 4:49 AM

Advertising is a weapon to attract voters - Sakshi

సూటిగా సుత్తిలేకుండా..గురిపెడితే టార్గెట్‌ రీచ్‌ అయ్యేలా..విమర్శనాస్త్రం సంధిస్తే.. వైరిపక్షం విలవిల్లాడేలా ఉంటున్నాయి రాజకీయ పార్టీల లఘు చిత్రాల ప్రకటనలు. పబ్లిక్‌ మీటింగ్‌లో అగ్రనేతలు దంచికొట్టే ఉపన్యాసాలు ఓటరును ఎంత మేర ప్రభావితం చేస్తాయో లేదో  కానీ, టీవీల్లో ప్రకటనల రూపంలో వస్తున్న పొలిటికల్‌ యాడ్స్‌ మాత్రం ప్రజల మూడ్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికార పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలు ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చని అంశాలను టార్గెట్‌ చేస్తూ బీజేపీ వీడియోలు ఉంటున్నాయి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏం మార్పు తెచ్చామన్నది అధికార బీఆర్‌ఎస్‌ చెప్పుకొస్తోంది. మొత్తంగా  ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆలోచింపజేసేలా.. ఆకర్షించేలా పొలిటికల్‌ యాడ్స్‌తో అదరగొడుతున్నాయి. 

ఓటర్‌కు వీలైనంత రీచ్‌ అయ్యేలా...
పొలిటికల్‌ యాడ్స్‌ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటోందని చెప్పాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనా వీడియోలను రూపొందించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌  సైతం కేసీఆర్‌ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏంటి..? మళ్లీ కేసీఆర్‌నే ఎందుకు సీఎం చేయాలన్నది సూటిగా అర్థమయ్యేలా లఘు చిత్రాలను రూపొందించి సోషల్‌ మీడియాలో ప్రచారం గుప్పిస్తోంది. ఇందుకోసం రాజకీయ ప్రత్యర్థులను ఠక్కున గుర్తించేలా క్యారెక్టర్లు, వారి హావభావాలను సైతం పలికించేలా ఈ వీడియోల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

విమర్శల ఘాటుతో ఫిర్యాదులు  
ఈ పొలిటికల్‌ యాడ్స్‌లో విమర్శల ఘాటు పెరగడంతో ఆయా పొలిటికల్‌ పార్టీల నాయకులు ఆ ప్రకటనలు నిలిపివేయించాలని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేశారు. అంతలా పొలిటికల్‌ యాడ్‌లు వేడి పెంచుతున్నాయి. ‘గులాబీ జెండా..తెలంగాణకు అండ’ ట్యాగ్‌తో బీఆర్‌ఎస్‌ షార్ట్‌ వీడియోలను చేస్తే..‘‘మార్పు కావాలి..

కాంగ్రెస్‌ రావాలి..’’అన్న ట్యాగ్‌లైన్‌ను కాంగ్రెస్‌ పార్టీ వాడుతోంది. ఇక బీజేపీ ‘‘సాలు దొర..ఇక నీకు సెలవు దొర..’’ట్యాగ్‌లైన్‌తో పిట్టల దొర క్యారెక్టర్‌ను పెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ లఘు వీడియోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. 

కంటెంట్‌ ఒకరిది.. మార్ఫింగ్‌ మరొకరిది..  
‘‘అప్పుడెట్లా ఉండే తెలంగాణ..ఇప్పుడెట్లుంది తెలంగాణ’’ అంటూ  అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రీల్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు మొదలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది ఈ రీల్‌ ఫార్ములా ఫాలో అయ్యారు. తీన్మార్‌ స్టెప్పులతో సదరు నాయకుడి కామెంట్లతో ఉన్న ఈ షార్ట్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో ఎంతో ఫేమస్‌ అయ్యాయి. అయితే ఎంతో ప్లానింగ్, కంటెంట్‌తో తయారు చేసిన ఈ షార్ట్‌ వీడియోలను ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నిక్స్‌ వాడి ప్రత్యర్థి పార్టీలు తిప్పికొడుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ‘అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగాణ’ వీడియోలను ప్రత్యర్థి పార్టీల సోషల్‌మీడియా గ్రూపుల సభ్యులు మార్ఫిగ్‌ చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.   ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌ (ఎక్స్‌), ఇన్‌స్టా్రగామ్‌ ఇలా అన్ని వేదికల్లోనూ వీడియోలు, రీల్స్‌.. వాటిపై ప్రత్యర్థుల మార్ఫింగ్‌లు హోరెత్తుతున్నాయి. 

-నాగోజు సత్యనారాయణ 

Advertisement
 
Advertisement