కోల్‌బెల్ట్‌ నుంచే శంఖారావం!  | Kavitha Strengthens her Foothold in the Mining Belt with the Launch of Singareni Jagruthi | Sakshi
Sakshi News home page

కోల్‌బెల్ట్‌ నుంచే శంఖారావం! 

May 30 2025 7:40 AM | Updated on May 30 2025 7:43 AM

MLC Kalvakuntla Kavitata with Jagruti Sena (file photo)

జాగృతి సైన్యంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (ఫైల్)

రాజకీయ వేదికగా సింగరేణి ప్రాంతం? 

గోదావరిఖని: రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోల్‌బెల్ట్‌ వేదికగా రాజకీయ ఆరంగేంట్రం చేస్తారా? అనే సందేహాలకు ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు.. భవిష్యత్‌లో సింగరేణిలో ‘జాగృతి’కి పెద్దపీట వేస్తారా? లేక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని బలోపేతం చేస్తారా? అనేదానిపై చర్చ కూడా జోరందుకుంది. ఈ రెండింటికీ సుప్రీం కల్వకుంట్ల కవిత కావడం ఇందుకు కారణమైంది.

పనితీరుపై ఆసక్తి..

సింగరేణి జాగృతి పనితీరు ఎలా ఉంటుంది, కార్మికులతో కలిసి ఎలా ముందుకు వెళ్తుంది? అనేదానిపై పీటముడి వీడడంలేదు. ఇదే సమయంలో టీబీజీకేఎస్‌ను భవిష్యత్‌ ఏమిటనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో కారుణ్య నియామకాలు, హక్కులను సాధించి పెట్టిన టీబీజీకేఎస్‌కు కార్మికుల్లో మంచి పట్టుఉంది. రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచి అన్ని ఏరియాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. గతగుర్తింపు సంఘం ఎన్నికలకు యూనియన్‌ దూరంగా ఉండడంతో యూనియన్‌ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొందరు నాయకులు ఇతర యూనియన్లకు వలసవెళ్లారు.

బీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండానే..

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షరాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత.. బీఆర్‌ఎస్‌ పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా సింగరేణి జాగృతి కన్వీనర్లను అన్ని ఏరియాల్లో నియమించారు. ఈమేరకు 11 ఏరియాల్లోని కన్వీనర్లకు నియామక పత్రాలు అందజేశారు. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్‌ను బలోపేతం చేయడంపై ఇటీవల దృష్టి సారించారు. 

ఈ నేపథ్యంలోనే అన్ని ఏరియాల్లో కమిటీలను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి, కల్వకుంట్ల కవితకు మధ్య గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణిలో జాగృతి కన్వీనర్లను నియమించడం చర్చనీయాంశంగా మారింది.

యాక్టివ్‌ నేతలపై ఆరా..

ఇటీవల రామగుండం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలి హోదాలో యూనియన్‌ సమావేశం కూడా నిర్వహించారు. యూనియన్‌ శ్రేణులను జాగృతం చేసేలా ప్రసంగించారు. అంతేకాకుండా కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో యూనియన్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇల్లెందు క్లబ్‌లో జరిగిన ఓ యూనియన్‌ నాయకుని ఫంక్షన్‌లో పాల్గొని అక్కడికి వచ్చిన యూనియన్‌ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

సింగరేణిలోని మొత్తం 11 ఏరియాల్లో యూనియన్‌ తీరు, యాక్టివ్‌గా ఉన్న నాయకుల గురించి ఆరా తీశారు. చాలారోజుల తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆమెకు ఘనస్వాగతమే లభించింది. ఈక్రమంలో గత మంగళవారం ఏరియా కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడం, ఇటు సొంత పార్టీ బీఆర్‌ఎస్‌, సొంత యూనియన్‌ టీబీజీకేఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. మిగతా యూనియన్లు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

కార్మిక క్షేత్రంలో పట్టుకోసమే..

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. కార్మిక క్షేత్రంతో కవితకు అనుబంధం కూడా ఎక్కువేగానే ఉంది. రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్‌కు గౌరవధ్యక్షరాలిగా కొనసాగారు. ఈక్రమంలో ఇక్కడి నుంచే రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించాలనే ఆలోచనతో సింగరేణి ఏరియాలో జాగృతి కన్వీనర్లను నియమించినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

టీబీజీకేఎస్‌ నేతలకు నో ఇన్‌ఫర్మేషన్‌

జాగృతి కన్వీనర్లకు నియామక లేఖలు ఇచ్చిన సమయంలో టీబీజీకేఎస్‌ నాయకులను కవిత ఆహ్వానించలేదంటున్నారు. మరోవైపు.. భవిష్యత్‌లో కూడా అన్నివేదికలపై పట్టు సాధించేందుకు బతుకమ్మ కమిటీలు, జాగృతి కమిటీలు, సాంస్కృతిక కమిటీలు.. ఇలా ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉంది. ఏదిఏమైనా కార్మిక క్షేత్రం నుంచే రాజకీయ అరంగేట్రం మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement