సర్‌ ముగిసింది | - | Sakshi
Sakshi News home page

సర్‌ ముగిసింది

Aug 10 2026 11:48 PM | Updated on Aug 10 2026 11:48 PM

చివరిరోజు డిజిటలైజేషన్‌తో బిజీబిజీ 46 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ ఈనెల 17న డ్రాఫ్ట్‌ జాబితా

ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ స్వీకరణకు తెర

చివరిరోజు డిజిటలైజేషన్‌తో బిజీబిజీ

46 రోజులపాటు కొనసాగిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాల స్వీకరణ

పరిష్కారానికి కూడా అవకాశం

సాక్షి పెద్దపల్లి:

టర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌–సర్‌) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ స్వీకరణ గడువు ముగిసింది. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఫామ్స్‌ సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. సేకరించిన వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే డిజిటలైజేషన్‌ ప్రక్రియకు అర్ధరాత్రి వరకూ గడువు ఉండటంతో.. చివరిరోజు అందిన ఫామ్స్‌ను నమోదు చేసేందుకు బీఎల్‌వోలు రాత్రివరకూ బిజీగా గడిపారు. జిల్లాలో మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, అందులో వందశాతం ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ను ఓటర్లకు పంపిణీ చేశారు. 6,30,876 మంది ఓటర్ల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తియింది. ఇది మొత్తం ఓటర్లల్లో 88.59 శాతంగా నమోదైంది. మిగిలిన దాదాపు 1,35,675 మంది ఓటర్లు తప్పుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తమ ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ను అన్నివివరాలతో పూర్తిచేసి బీఎల్‌వోలకు అందజేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో నివాసం ఉంటున్నవారు బోనాల పండుగ సందర్భంగా స్వస్థలాలకు రావడంతో తమఓటు వివరాలను నమోదు చేసుకున్నారు. దీంతో చివరిరోజు కూడా బీఎల్‌వోలకు పెద్దసంఖ్యలో ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ అందాయి. ఒకవైపు ఫామ్స్‌ సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్‌వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం సమీపిస్తుండడంతో చివరిరోజు రాత్రివరకూ డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగించారు.

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తొలుత జూన్‌ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈకాలంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ స్వీకరించి, వాటివివరాలను డిజిటలైజ్‌ చేయాల్సి ఉంది. అయితే ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడిగించింది. చివరగా ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు తుది గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్‌ ప్రక్రియకు సోమవారం తెరపడింది.

ఎన్యూమరేషన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు తదుపరిదశపై దృష్టి సారించనున్నారు. ఈనెల 17న డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఓటర్లు ఈ జాబితాలో తమపేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్‌ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈనెల 17 నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీచేసి అక్టోబర్‌ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తిచేసిన అనంతరం అక్టోబర్‌ 19న తుదిఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక ఓటర్లంతా డ్రాఫ్ట్‌ జాబితా విడుదలయ్యే రోజును దృష్టిలో పెట్టుకుని తమపేరు, వివరాలను మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement