మంథనిరూరల్: సుమారు ఇరవై ఏళ్లుగా ఉపాధిహా మీ పథకం(వీబీజీ రాంజీ)లో పనిచేస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఉద్యోగులు పోరుబాట పట్టారు. గతనెల 27వ తేదీ నుంచి పెన్‌డౌన్, కంప్యూటర్ షెట్‌డౌన్ చేపట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా పేస్కేల్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్‌లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామంటూ చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 64మంది
జిల్లాలోని 14 మండలాల్లో వీబీజీ రాంజీ పథకంలో 69 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 11మంది ఏపీవోలు, 9 మంది ఈసీలు, 24 మంది టీఏలు, 17మంది సీలోలతోపాటు జిల్లాకేంద్రంలో మరో 8మంది విధులు నిర్వహిస్తున్నారు. 2006లో జిల్లా సెలక్షన్ కమిటీ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా విఽవిధ హోదాల్లో వీరంతా ఎంపికయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని డీఆర్‌డీఏలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ కింద విధులు నిర్వహిస్తున్నారు.
పే స్కేల్ అమలు చేయాలని..
వీబీజీ రాంజీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలనేది ప్రధాన డిమాండ్‌గా చెబుతున్నారు. దీనితోపాటు వేతనాలు ప్రతీనెల ఒకటో తేదీన చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎఫ్‌టీలుగా గుర్తించాలని గత పది రోజులుగా ఆయా మండల కేంద్రాల్లో పెన్‌డౌన్.. కంప్యూటర్ షట్‌డౌన్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐకేపీ ఉద్యోగులకు గత ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయగా ఉపాధిహామీ ఉద్యోగులకు ఇప్పటివరకు పేస్కేల్ వర్తింప జేయకపోవడంతో పోరుబాటకు శ్రీకారం చుట్టారు.
పే స్కేల్ కోసం పోరు
పేస్కేల్ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఇది అమలైతే మా ఆకాంక్ష నెరవేరుతుంది. వేతనాల చెల్లింపు, బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ అమలు చేయాలి. అనేక సమస్యలు ఉన్నా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అనేక సేవలు అందించాం. ఇప్పటికై నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా డిమాండ్లను పరిష్కరించాలి.
– సదానందం, ఏపీవో, మంథని
ఆగిన అభివృద్ధి పనులు
వీబీజీ రాంజీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు విధులకు హాజరైనా.. పెన్‌డౌన్, కంప్యూటర్ షట్‌డౌన్ చేయడంతో జిల్లాలోని అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వనమహోత్సవ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా ఉద్యోగుల పోరుబాటతో ఆలస్యం అవుతోంది. జలసిరి, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు.


