పనిచేయని కోల్డ్‌స్టోరేజీ
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్(సిమ్స్–ప్రభుత్వ)లోని అనాటమీ డి–సెక్షన్ కోల్డ్‌స్టోరేజీలో పార్ధివదేహాలను భద్రపరిచే ఫ్రీజర్‌బాక్స్‌లు నిరుపయోగంగా మారాయి. ఒకేఫ్రీజర్‌లో నాలుగు పార్థివదేహాలను భద్రపరిచే సామర్థ్యం కలిగిన బాక్స్.. నెలరోజులుగా పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పలు కుటుంబాలు ఎంతోస్ఫూర్తితో తమ ఆత్మీయుల పార్థీవదేహాలను మెడికల్ కళాశాలకు దానం చేస్తుండగా.. సౌకర్యాలలేమి వారి మనోభావాలను దెబ్బతీస్తోంది. గోదావరిఖనిలోని న్యాయవాది గోసిక ప్రకాశ్ గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన పార్థివదేహాన్ని బుధవారం కుటుంబ సభ్యులు సిమ్స్‌కు దానం చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం వారు దానంచేస్తే.. మెడికల్ కాలేజీకి కాకుండా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మార్చురీకి తరలించాలని సూచించారు. దీంతో గత్యంతరం లేక స్వచ్ఛంద సంఘాలు కుటుంబ సభ్యులను జీజీహెచ్‌లోని మార్చురీలో భద్రపర్చడానికి ఒప్పించారు.
మార్చురీకి తరలించడమా..?
మెడికల్ కాలేజీకి దానం చేయడానికని పార్థివదేహాన్ని తీసుకొస్తే.. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరుస్తామని చెప్పడంపై దేహదాత కుటుంబాలు, న్యాయవాదులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ ఎదుట వైద్యులను ఇదేఅంశంపై నిలదీయడంతో తీవ్రఆందోళనకు దారితీసింది. పార్థీవదేహ దానాలకు తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన వైద్యకళాశాలలో ఇలాంటి పరిస్థితులు ఉండడం శోచనీయమని మండిపడ్డారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు దేహదాత కుటుంబాల పక్షాన స్పందించి, వెంటనే సిమ్స్ ప్రిన్సిపాల్, అనాటమీ హెచ్‌వోడీలతో చర్చించి సమస్య పరిష్కారాని చొరవ తీసుకున్నారు. దీంతో పార్థివదేహాన్ని మార్చురీ నుంచి మెడికల్ కాలేజీకి తీరలించారు.
లయన్స్‌క్లబ్ ఫ్రీజర్‌లోనే..
రామగుండం లయన్స్ క్లబ్ మంగళవారం పార్థివదేహాన్ని భద్రపర్చడానికి ఫ్రీజర్‌బాక్స్ ఇచ్చింది. అందులోనే ప్రకాశ్ పార్థివదేహాన్ని గురువారం ఉదయం వరకు అనాటమీ డి –సెక్షన్ హాల్‌లో ఉంచాలని అధికారులు సూచించారు. ఇటీవల కూడా ఓ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు దానం చేయగా, ఆ పార్థివ దేహాన్ని కూడా సుమారు మూడురోజులపాటు జీజీహెచ్ మార్చురీలో భద్రపర్చడంపై కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అత్యవసరమైన ఫ్రీజర్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి కూలింగ్ స్టోర్‌ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మెడికల్ కాలేజీలో దుస్థితి
అనాటమీ డీ – సెక్షన్ ఫ్రీజర్ బాక్స్‌లో సాంకేతిక సమస్య
మనోభావాలను దెబ్బతీస్తున్నారని దాతల ఆవేదన
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్థీవదేహదాత కుటుంబాలు


