ఆశావహుల సందడి
2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీల్లో జనాభా వివరాలు..
ఇంటెలిజెన్స్ సర్వేలు
పురపాలికల్లో వెలిసిన ఫ్లెక్సీలు
ప్రారంభమైన ఆశావహుల పర్యటనలు
ఏకాదశి, న్యూఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలతో జనాల్లోకి..
పార్టీ పెద్దల కంట పడేందుకు తాపత్రయం
ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ సర్వే
తొలివిడత పూర్తి.. రెండోవిడతకు సిద్ధం
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు కాగా.. మిగిలినవి పురపాలికలు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు కసరత్తు ప్రారంభించడంతో మున్సిపాలిటీలలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఆశావహుల సందడితో పట్టణాలు, నగరాల్లో రాజకీయ సందడి నెలకొంది. నిన్నటివరకు పల్లెపోరు కారణంగా పట్టణాల్లో మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు రంగంలోకి దిగారు. బల్దియాల పరిధిలో ప్లెక్సీలు వెలుస్తుండటంతో ఎన్నికల హడావుడి మొదలైనట్లే అనిపిస్తోంది. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డు, డివిజన్‌లోనూ తానే అభ్యర్థిని అన్నట్టు ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా శుభాకాంక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏకాదశి, కొత్త ఏడాది, సంక్రాంతి వంటి పండుగలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. శుభాకాంక్షలతో పాటు పరిచయం పెంచుకోవడం అనే వ్యూహంతో ఇంటింటికీ తిరుగుతూ నూతన సంవత్సర క్యాలెండర్‌లు, డైరీలు పంచుతూ.. తమ ఉనికిని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం పండుగల శుభాకాంక్షలు మాత్రమే కాకుండా.. రాబోయే ఎన్నికలకు రిహార్సల్‌లా మారింది.
పార్టీలకు ప్రతిష్టాత్మకం
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆటుపోట్లను చవిచూసిన పార్టీలు.. మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాల్లో పాగా వేసేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే పక్కాప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోష్ మీదున్న అధికార కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాగా ఉంది. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ కూడా మున్సిపాలిటీల్లో తామేం తక్కువ కాదన్నట్లు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక బీజేపీ పంచాయతీ ఎన్నికలో ఊహించిన దానికన్నా ఎక్కువ బలం పెంచుకుని మున్సిపాలిటీలపై కన్నేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఆశావహుల గల్లీ బాట
ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి.. పోటీ చేసే ఆశావహులు గల్లీల బాట పట్టారు. ఉదయం ఆలయ దర్శనాలు.. మధ్యాహ్నం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం.. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు. ఇదే రోజువారీ షెడ్యూల్‌గా మారింది. ప్రజల సమస్యలు వింటూ.. చిన్నచిన్న హామీలు ఇస్తూ తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల కంట్లో పడేందుకు చేస్తున్న తాపత్రయం మరోస్థాయికి చేరుతోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే దానిపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ప్రజల్లో బలం చూపించాలి. మరోవైపు పార్టీ హైకమాండ్‌కు నమ్మకం కలిగించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేందుకు వారు విశేషంగా శ్రమిస్తున్నారు. కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో ముందుండగా.. మరికొందరు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
బల్దియా వార్డులు జనాభా ఎస్టీ ఎస్సీ
కరీంనగర్ 66 3,28,870 5,999 36,902
(కార్పొరేషన్)
రామగుండం 60 2,37,636 4,278 50,744
(కార్పొరేషన్)
ధర్మపురి 15 17,423 200 2,079
జగిత్యాల 50 83,168 547 5,229
కోరుట్ల 33 69,479 342 6,467
మెట్‌పల్లి 26 54,042 504 5,819
రాయికల్ 12 15,308 179 1,766
చొప్పదండి 14 16,459 205 3,062
హుజూరాబాద్ 30 34,555 309 6,326
జమ్మికుంట 30 39,476 286 7,623
మంథని 13 18,282 208 2,513
పెద్దపల్లి 36 50,762 312 4,527
సుల్తానాబాద్ 15 19,772 309 2,561
సిరిసిల్ల 39 92,091 104 6,346
వేములవాడ 28 43,620 453 6,545
ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా కీలకంగా మారాయి. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని పురపాలికల ఎన్నికలపై ప్రజల అభిప్రాయం, స్థానిక సమస్యలు, అధికార పార్టీపై ఉన్న సంతృప్తి.. లేదా అసంతృప్తి వంటి అంశాలను సేకరించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. తొలి విడత సర్వే పూర్తయ్యిందని, రెండో విడతకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆయా పార్టీలు ప్రైవేటు సర్వేలు చేయిస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలతో వార్డులు, డివిజన్లలో సర్వేలు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజకీయంగా మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశావహుల సందడి, పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ సర్వేలు.. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల సమరం మొదలైనట్టే అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఆశావహుల సందడి
ఆశావహుల సందడి


