ఓటరు ముసాయిదా విడుదల
● పుర పోరుకు అడుగులు ● 10న తుది జాబితా ప్రకటన
సాక్షి, పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పై‘చేయి’ సాధించడంతో రాష్ట్రప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి అనుగుణంగానే వార్డుల వారీగా ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గురువారం ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించారు. ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 5న మున్సిపల్, 6న జిల్లాస్థాయిలో రాజకీయపార్టీలు, పోలింగ్ సిబ్బందితో సమావేశం కానున్నారు. ఓటరు జాబితా, వార్డులు, పోలింగ్ కేంద్రాల ప్రక్రి య పూర్తిగానే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
పాలకవర్గాల గడువు ముగిసి
రామగుండం కార్పొరేషన్ సహా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలకు 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు అదే నెల వె లువడ్డాయి. అదేనెల 28న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతేడాది జనవరి 27తోనే పాలకవ ర్గాల కాలపరిమితి ముగిసింది. అప్పటి నుంచి బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
మారనున్న రిజర్వేషన్లు
2020లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టం తీసుకొచ్చి పదేళ్లకు ఒకేరిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత రావడంలేదు. ఈ సారి సీపెక్ సర్వే ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయా? లేక వార్డు సభల ద్వారా చేస్తారా? అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుత రిజర్వేషన్లలో మహిళ, జనరల్ రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
అక్టోబర్ జాబితా ఆధారంగానే
ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 31న ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగానే వార్డుల వారీగా ఓట రు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చా యి. అధికారులు ఇప్పటికే వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి ముసాయి దా జాబితా ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణ కు 4వ తేదీ వరకు గడువు విధించారు. 5న మున్సిపల్ స్థాయిలో వివిధ పార్టీలతో కమిషనర్లు సమావేశాలు నిర్వహించి 10న తుది జాబితా ఇస్తారు.


