ముస్తాబవుతున్న మినీమేడారం
గోదావరిఖని: రామగుండం నగర శివారులోని గోదావరి నదీతీరంలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గద్దెల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సీసీరోడ్డు, తోరణం తదితర పనులు చేపట్టారు. జాతర ఆధునికీకరణ కోసం సింగరేణి యాజమాన్యం సుమారు రూ.4కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం మరికొన్ని నిధులు సమకూర్చాయి. గద్దెల ప్రాంతాన్ని 4 మీటర్ల వరకు ఎత్తుపెంచడం, ఫ్లోరింగ్ చేయడం, ప్రహరీ నిర్మాణం, గ్రిల్స్ ఏర్పాటు చేయడం, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనుల్లో వేగం పెంచారు. జాతర ప్రాంగణం ముందు సమ్మక్క–సారలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లాగా జాతరలోకి వెళ్లే ఎడమవైపు టికెట్ కౌంట ర్లు, కుడివైపు క్యూలైన్లు నిర్మిస్తున్నారు.
భారీ షెడ్డు నిర్మాణం
జాతర సమయంతో పాటు ఇతర రోజుల్లో కూడా ఈప్రాంతానికి వచ్చే భక్తులు సేదతీరేందుకు భారీ రేకుల షెడ్డు నిర్మించారు. దాని చుట్టూ గోడల నిర్మాణం శరవేగంగా సాగుతోది.
ఒకేలైన్‌లో అమ్మవారి గద్దెలు..
సమ్మక్క– సారలమ్మ, జంపన్న గద్దెలు ఒకేలైన్‌లో ఏర్పాటు చేశారు. భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా రెండువైపులా ప్రత్యేకంగా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
పుష్కరఘాట్ ఆధునికీకరణ
భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరఘాట్‌ను ఆధునికీకరిస్తున్నారు. నదిలోకి వెళ్లి స్నానాలు చేసేందుకు మెట్ల మార్గాన్ని మరమ్మతు చేస్తున్నారు. జల్లు స్నానాలు చేసేందుకు వీలుగా సింగరేణి పైపులైన్లు ఏర్పాటు చేస్తోంది. మెట్ల పనులు ఇంకా ప్రారంభించలేదు.
పాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం
జాతర సమయంలోనే కాకుండా ఏడాది పాటు భక్తులు వచ్చేలా అన్నిఏర్పాట్లు చేస్తున్నాం. సెలవురోజుల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా గడిపేలా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం. మరోపాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా సమ్మక్క– సారలమ్మ జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం


