కుట్టు.. ఉపాధికి మెట్టు
ఉచిత కుట్టు శిక్షణపై మహిళల ఆసక్తి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు నాలుగు మండలాల్లో 20 శిక్షణ కేంద్రాలు గ్రామాల్లో ఉపాధి పొందనున్న మహిళలు
మంథనిరూరల్: మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. నిన్నామొన్నటి వరకు వంటింటికే పరిమితమైన గువలు.. నేడు ఉపాధి మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. కుటుంబానికి తమవంతుగా ఆసరాగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్నారు. వియాట్రిస్ ఫెమీలైఫ్ సైన్స్ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఎలీప్ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ పొందుతున్నారు.
నాలుగు మండలాలు.. 20 శిక్షణ కేంద్రాలు
మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో 20 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంథని మండలంలో 11, ముత్తారంలో 03, రామగిరి మండలంలో 03, కమాన్‌పూర్ మండలంలో 03 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో సెంటర్‌లో సుమారు 50 మంది వరకు మహిళలు ఉచితంగా కుట్టు శిక్షణ పొందుతున్నారు.
కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
గతేడాది నవంబర్ 24న మంథని నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. ఎగ్లాస్‌పూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక చేయూతనందించే విధంగా ఉపాధి అవకాశాల కల్పన కోసమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అదేనెల 25 నుంచి నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉచిత శిక్షణ ప్రారంభమైంది.
ప్రత్యేక శిక్షకుల పర్యవేక్షణలో..
ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షకుల పర్యవేక్షణలో మహిళలు తర్ఫీదు పొందుతున్నారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు శిక్షకులను నియమించారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు బ్యాచ్‌లుగా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. మధ్యాహ్న సమయంలో భోజన సదుపాయం కూడా కల్పించారు.
మిషన్.. చేతి కుట్టుపై..
ఉచిత మిషన్ కుట్టు కేంద్రాల్లో మిషన్ కుట్టు, చేతికుట్టుపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 50 మంది మహిళలు, యువతులు శిక్షణ పొందుతున్నారు. వీరికి అవసరమైన వస్త్రాలు, టేపు, దారపురీళ్లు, సూదులు ఒక బ్యాగ్‌ను కంపెనీ ఉచితంగా అందజేసింది. ముఖ్యంగా ఖాజాలు కుట్టడం, కొలతలు తీసుకోవడం, పంపకాలు, కటింగ్ వంటివి ఈ శిక్షణలో నేర్పిస్తున్నారు.


