వలపు వల పన్ని..!
కోరుట్ల: అమ్మాయిని ఎర వేసి..ఊరించి వలపు వల పన్ని కాసులు రాబట్టాలని చూసిన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన మెట్‌పల్లిలో కలకలం రేపింది. వివరాలు.. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌కు చెందిన రియల్టర్ కొంతకాలంగా మెట్‌పల్లి పట్టణంలోని గోల్‌హనుమాన్ సమీపంలో నివాసముంటున్నాడు. మూడు నెలల క్రితం ఓ మహిళ ఇతడిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకుంది. సదరు అమ్మాయి తరచూ ఫోన్ కాల్ చేస్తూ వలపు వల వేసి ఊరించేది. గత ఆదివారం మనం కలుద్దామని చెప్పి మెట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఇంటికి రమ్మంది.
వలపన్నారు..
హానీ ట్రాప్‌ను గుర్తించలేకపోయిన రియల్టర్ ఆ మహిళ చెప్పిన ఇంటికి వెళ్లి ఆమె అపార్ట్‌మెంట్ రూంలోకి వెళ్లగానే సదరు రియల్టర్ ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోను హానీ ట్రాప్ ముఠా సభ్యలు గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించారు. అనంతరం నలుగురు వ్యక్తులు ఆ గదిలోకి వెళ్లి ఎవరు మీరు, ఏలా వచ్చారు, మహిళతో ఇక్కడ ఏం చేస్తున్నారని రియల్టర్‌ను బెదిరించారు. దీంతో బిత్తరపోయిన రియల్టర్ ఆ మహిళ పిలిస్తేనే వచ్చానని చెప్పినా వినకుండా తాము తీసిన వీడియోలు బయటపెడతామంటూ కాసుల బేరం పెట్టారు. దీంతో రియల్టర్ గత్యంతరం లేక రూ.7 లక్షలు చెల్లిస్తానని చెప్పి బతిమిలాడుకుని బయటపడ్డాడు. తర్వాత తనను వలపువల వేసి హానీ ట్రాప్‌లో ఇరికించారని గుర్తించిన రియల్టర్ మెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆరుగురిపై కేసు..
రియల్టర్‌ను హానీ ట్రాప్‌లో ఇరికించి బ్లాక్‌మెయిల్‌కు దిగిన ముఠా సభ్యులు బల్మూరి స్వప్న, కోరుట్ల రాజ్‌కుమార్, విలేకరిగా చెప్పుకున్న పులి అరుణ్, బట్టు రాజశేఖర్, సుంకెటి వినోద్, మాగిని దేవనర్సయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుల్లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఓ జాతీయ పార్టీకి చెందిన నేతకు అనుచరుడన్న అంశం ప్రచారంలోకి వచ్చింది.


