
నులి పురుగులను నలిపేద్దాం
● నేటి నుంచి నులిపురుగుల నివారణ కార్యక్రమం ● అందుబాటులో 2,41,450 అల్బెండజోల్ మాత్రలు
సుల్తానాబాద్: నులి పురుగుల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జాతీయ బోధకాలు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఈనెల 11నుంచి కార్యక్రమం అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. బోధకాలు వ్యాధి, నులి పురుగుల నిర్మూలనకు సామూహికంగా డీఈసీ, అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,27,250 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి మాత్రలు వేసేందుకు 706 మందిని ఎంపిక చేశారు. ఒక్కో బృందంలో ఒక ఆశా కార్యకర్త, ఒక అంగన్‌వాడీ టీచర్ ఉంటారు. ఇప్పటికే యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో వైద్యాధికారులు సమావేశమై సూచనలు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా డాక్టర్లకు, సూపర్‌వైజర్లకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నప్రసన్నకుమారి శిక్షణ ఇప్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు మిగిలిన వారిని ఈనెల 18న మాఫ్ ఆఫ్ దినోత్సవం నిర్వహించనున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు గోదావరిఖని కార్పొరేషన్, 14 మండలాలు, 266 గ్రామపంచాయతీలు ఉన్నాయి. యూపీఎస్సీలు 8, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 16 ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు 534, ప్రైవేటు పాఠశాలలు 161, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 40, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 13 ఉన్నాయి. అందులో 2,27,250 మంది అర్హులను గుర్తించారు. 2,,41,450 మాత్రలు అందుబాటులో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. మాత్రలు వేసుకున్న వారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలుపుతున్నారు.