
మోకాళ్లలోతు వరద
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ 49వ డివిజన్ పరిధి మార్కండేయకాలనీలోని బీసీ హాస్టల్ లైన్‌లో శనివారం కురిసిన వర్షానికి వరదనీరు చెరువును తలపించేలా నిలిచిపోయింది. సమీపంలోని నాలాలోకి వెళ్లే మార్గం లేక ఇళ్ల ముందు మోకాళ్లలోతు వరద నీటిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్ నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన వరదనీటిని మళ్లించే చర్యలు చేపట్టకపోతే, సమీపంలోని ఇళ్లల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. నగరపాలక అధికారులకు ఎన్నిమార్లు విన్నవించుకున్నా, స్పందన లేదన్నారు. కొత్తగా నిర్మించిన నాలా సైడ్‌వాల్‌కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరు చెరువును తలపిస్తోందన్నారు. అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.