
రొడ్యాంపై వరద.. నిలిచిన రాకపోకలు
మంథనిరూరల్: రెండు రోజులతో పాటు శుక్రవారం రాత్రి నుంచి కురిసిన బారీ వర్షానికి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామసమీపంలోని రొడ్యాంపై వరద ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న గుంజపడుగు, నాగారంతో పాటు కొత్త చెరువు అలుగు పడి రొడ్యాం మీదుగా వరద వెళ్తోంది. దీంతో మంథని నుంచి విలోచవరంకు రాకపోకలు నిలిచిపోయాయి. విలోచవరం వెళ్లాలంటే నాగారం మీదుగా పోతారం నుంచి రావాల్సి ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
విలోచవరం రొడ్యాంపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎస్సై డి.రమేశ్ ఆదేశాల మేరకు ఏఎస్సై మల్లయ్య, గ్రామ పోలీస్ ఆఫీసర్ రమేశ్‌రావు, హెడ్‌కానిస్టేబుల్ సురేశ్‌శర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పై నుంచి వరద నీరు వస్తోందని, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అప్రమత్తమైన రైతులు
భారీ వర్షాల కారణంగా గోదావరినదిలోకి వరద వచ్చే అవకాశాలు ఉండడంతో విలోచవరం, ఉప్పట్ల, గుంజపడుగు గ్రామాల రైతులు అప్రమత్తమయ్యారు. సాగునీటి కోసం గోదావరినదిలో ఏర్పాటు చేసిన బోరు మోటార్లను తీసుకు వస్తున్నారు. గతేడాది అకస్మాత్తుగా నదిలోకి భారీ వరద వచ్చి రైతుల మోటార్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో రైతులు ముందస్తు చర్యగా నదిలోని మోటార్లను తీసుకువస్తున్నారు.

రొడ్యాంపై వరద.. నిలిచిన రాకపోకలు