నబరంగ్‌పూర్‌ నెత్తిన న్యూక్లియర్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

నబరంగ్‌పూర్‌ నెత్తిన న్యూక్లియర్‌ పిడుగు

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

భూ సర్వే పూర్తి చేసిన ఎన్‌టీపీసీ అధికారులు

రూ.1.5 లక్షల కోట్ల వ్యయంతో నిర్మాణ సన్నాహాలు

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా ప్రజల నెత్తిన కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంతో పిడుగు వేశాయని బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదిప్‌ మజ్జి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో గ్లేజ్‌ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. జిల్లాలో తెంతులకుంటి సమితి పూజారిగుడ సమితి నువాగుడ ప్రాంతంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల వ్యయం తో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుందని ప్రకటించారు. అందుకోసం అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాయన్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణం వల్ల జిల్లా మరుభూమిగా మారుతుందన్నారు. అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో పవర్‌ ప్లాంట్‌ రిజర్వాయర్‌ ఉన్న ఖాతీ గుడ డ్యామ్‌ సమీపంలో ఈ ప్లాంట్‌ నిర్మిస్తారన్నారు. అందుకు తగ్గ ప్రభుత్వ రికార్డులు సమావేశంలో విడుదల చేశారు. ఈ ప్లాంట్‌ వలన 6000 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందన్నారు.

మోదీ–అదానీల రహస్య ఒప్పందం

ఈ ప్లాంట్‌ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, గౌతం అదానీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. వారు చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి మొహన్‌ చరణ్‌ మజ్జి, మరో మంత్రి కనక వర్ధన్‌ సింగ్‌లు వినాలన్నారు. ఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగితే 30 కిలోమీటర్ల దూరంలో ప్రజలు జీవించడం అసాధ్యమని తెలిపారు. మూడు దశాబ్దాల పాటు రేడియేషన్‌ ప్రభావం ఉంటుందన్నారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు వీటిని సముద్రంలో నిర్మిస్తున్నాయన్నారు.

మా అనుమతి తీసుకోలేదు

తమ ప్రాంతం లో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పై బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌టీపీసీ అధికారులు తమ ప్రాంతం లో మట్టి సామర్థ్యం కోసం పరీక్షలు చేస్తున్నప్పుడు తాము అనుమానంతో గతంలో ప్రశ్నించామన్నారు. ఇవి బోర్‌ వెల్‌ పరీక్షలు అని సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగామని తెలిపారు. ఇదే విషయమై కలెక్టర్‌, తహసీల్దార్లను అడిగితే సరైన సమాధానం రాలేదని తెలిపారు. తమ ప్రాంతంలో 50 కిలో మీటర్ల పరిధిలో 120 మీటర్ల లోతులో సుమారు 10 చోట్ల డ్రిల్లింగ్‌ జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెలువడ్డాయన్నారు. బాధిత 11 గ్రామాల్లో పల్లె సభ,గ్రామ సభల కోసం ఇంత వరకు అధికారులు రాకుండా పరీక్షలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరిట అన్యాయం జరుగుతుందని డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆరోపించారు. ఈ ప్రాంతంలో రైల్వే నిర్మాణం త్వరగతిన ముందుకు సాగడం పట్ల వెనుక ఉన్న ఉద్దేశ్యం న్యూక్లియర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసమే అన్నారు. గ్రామ గ్రామాన ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ ప్లాంట్‌ వలన జరిగే నష్టం వివరిద్దామని మున్నా త్రిపాఠి ప్రకటించారు. ఇదే సమావేశం లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ లిఫికా మజ్జి మాట్లాడుతూ మరో జెన్‌–జీ ఉద్యమం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement