రాయగడ: బొగ్గులోడుతో విశాఖపట్నం నుంచి రాయిపూర్ వెళ్తున్న బొగ్గు లారీ సదరు సమితి పరిధిలోని పత్రాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం వేకువజామున చోటు చేసుకున్న ఈ ఘటన వల్ల ఒడిశా ఆంధ్ర రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సుమారు ఆరు గంటల పాటు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన బొగ్గును తొలగించే పనులు చేపట్టారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
పద్మపూర్‌లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి వినతులను స్వీకరించారు. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది వినతులను అందజేశారు. వీటిలో 49 వ్యక్తిగత సమస్యలుగా కాగా..మరో 12 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలొ జిల్లా ఎస్పీ రాజ్‌ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, డీఎఫ్‌వో అన్నా సాహెబ్ అహాలే, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్, గుణుపూర్ ఎస్‌డీపీవో బబులి నాయక్, గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ
విద్యార్థిని మృతి
రాయగడ: ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. జిల్లాలోని బిసంకటక్ పోలీస్‌స్టేషన్ పరిధి సనోగొతిగుడ గ్రామానికి చెందిన రమాకాంత్ పిరిసిక కూతురు మమత పిరిసిక (18)గా గుర్తించారు. ఆమె బిసంకటక్‌లోని మా మార్కమా కళాశాలలో ఇంటర్ చదువుతుండేది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబీకులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల ఒకటో తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అస్వస్థకు గురయ్యింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు బింసటకటక్‌లోని ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. దాదాపు వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రామాకాంత్ బిసంకటక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు అసహాజ మరణంగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
కిటకిటలాడిన మల్లికేశ్వర్ ఆలయం
మల్కన్‌గిరి : జిల్లా కేంద్రంలో పాత్రోగూడ గ్రామం వద్ద కొండ పైన వున్న మల్లికేశ్వర్ స్వామి ఆలయం సోమవారం శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా కిటకిటలాడింది. స్వామికి కావిళ్లతో నీటిని తెచ్చి అభిషేకించారు. బోల్‌భం భక్తులతో పాటు సామాన్యులు కూడా కొండపైకి ఎక్కి శివుడిని దర్శించుకున్నారు.


