భువనేశ్వర్: ఝార్సుగుడ జిల్లా లో ఆదివారం వింత సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కాలు కింద పడిన నాగు పామును ఓ వ్యక్తి కొరికేశాడు. ఈ వింత సంఘటన ఝార్సుగుడ జిల్లా కర్మపొడా గ్రామంలో చోటు చేసుకుంది. పామును కొరికి విసిరేసిన వ్యక్తిని ధరం సింగ్ ఖడియాగా గుర్తించారు. అతడిని పొరుగున ఉన్న సంబల్‌పూర్ జిల్లా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ధరం సింగ్ ఖడియా చెప్పిన ప్రకారం.. అతను పొలానికి వెళ్తుండగా దారిలో నాగు పామును ప్రమాదవశాత్తు తొక్కాడు. ఆ పాము పడగ పైకి ఎత్తగానే దాన్ని పట్టుకుని కొరికేసి పక్కకు విసిరేశాడు. ‘ఆ పాము నన్ను కాటు వేయలేదు. నేను దాన్ని కాటు వేసి పారేశాను. అది ఒక నాగుపాము,’ అని చెప్పాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఖడియా భయపడి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వారు అతడిని చికిత్స కోసం సంబల్‌పూర్ జిల్లా గోవింద్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి హుటాహుటిన తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత ధరం సింగ్ ఖడియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ అతడిని 24 గంటల పాటు పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. ఈ అసాధారణ సంఘటన స్థానిక నివాసితులను దిగ్భ్రాంతికి గురి చేసింది. విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు.


