జయపూర్‌ సేవా పేపర్‌ మిల్లు ఉద్యోగుల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

జయపూర్‌ సేవా పేపర్‌ మిల్లు ఉద్యోగుల ఆకలి కేకలు

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

కొరాపుట్‌: కలెక్టరేట్‌ ఎదుట జయపూర్‌లోని సేవా పేపర్‌ మిల్లు ఉద్యోగులు ఆందోళన చేశారు. రెండేళ్ల క్రితం జయపూర్‌ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేడియంలో సుభద్ర యోజన పథకం ప్రారంభించారు. అదే సమయంలో మూతపడిన సేవా పేపర్‌ మిల్లు ఉద్యోగుల బాధలు తాము సీఎంకి వివరించామన్నారు. త్వరలో పేపర్‌ మిల్లు తెరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్లు ముగిసినా సీఎంలో స్పందన లేదన్నారు. నేటికి 70 మంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. అయినా సీఎంలో స్పందన లేదన్నారు. తమ సమస్య మరో సారి ప్రభుత్వ దృష్టిలో పెట్టడానికి కలెక్టర్‌ని కలిశామని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కరించక పోతే మిగతా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పేపర్‌ మిల్లు ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రమొద్‌ మహాంతి, సీపీఐ జిల్లా కార్యదర్శి జుదిష్ట రవులో తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

రాయగడ: జిల్లాలోని కాశీపూర్‌ సమితి టికిరి ప్రాంతంలో ఉన్న ఒక పెట్రోల్‌ బంక్‌ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కటక్‌ ప్రాంతానికి చెందిన కున్న (24) గా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం కున్న అనే యువకుడు రాయగడకు సమీపంలో గల జేకేపూర్‌లో నివసిస్తున్నాడు. ఏదో పని మీద సోమవారం ఉదయం తన స్నేహితుడితో కలసి బైకు పై టికిరి వెళ్లాడు. తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో టికిరి సమీపంలో గల ఒక పెట్రోల్‌ బంకు వద్ద గుర్తు తెలియని వాహనం అతని బైకుని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైకును నడుపుతున్న కున్న తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందగా బైకుపై ఉన్న అతని స్నేహితుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పికప్‌ వ్యాన్‌ బోల్తా : ఒకరు మృతి

భువనేశ్వర్‌: బాలాసోర్‌ జిల్లా జలేశ్వర్‌ ప్రాంతంలో కార్మికుల్ని రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. 57వ నంబరు రాష్ట్ర రహదారి తొలొబొణియా సమీపంలో ఈ విచాకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. భొగొరాయిలో వ్యవసాయ పనులు ముగించుకుని వీరు మయూర్‌భంజ్‌కు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

అశ్లీల వీడియోలు పోస్టు చేసిన యువకుడి అరెస్టు

రాయగడ: ఒక యువతికి సంబంధించిన అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి బొడొసందుబడి గ్రామానికి చెందిన సంతొష్‌ ముటికగా గుర్తించారు. జిల్లాలోని శెశికాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం బొడొసందుబడి గ్రామానికి చెందిన ఒక యువతిని సంతోష్‌ ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో ఆ యువతి ఫొటోలను తన మొబైల్‌లో చిత్రీకరించాడు. అయితే తనను పెళ్లి కోవాలని యువతి సంతోష్‌ను కోరింది. కానీ సంతోష్‌ ఒప్పుకోకుండా గ్రామం విడిచి వెళ్లిపోయాడు. తాను పెళ్లి చేసుకోను, ఇంకెవ్వరినీ చేసుకోనివ్వను అంటూ వేధించసాగాడు. యువతి కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో సంతోష్‌ ఆ యువతి అశ్లీల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో ఆ యువతి తండ్రి పూర్ణ మండంగి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement