జాలర్లకు సిరులు కురిపించిన ఇలిసి చేపలు | - | Sakshi
Sakshi News home page

జాలర్లకు సిరులు కురిపించిన ఇలిసి చేపలు

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

భువనేశ్వర్‌: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులోని దిఘా నదీ ముఖ ద్వారం వద్ద వల పన్నిన జాలర్లకు ఇలిసి (హిల్సా) చేపలు సిరులకు కురిపించాయి. మత్స్యకారుల వలలో 30 టన్నులకు పైగా హిల్సా చేపలు పడడంతో ఆనందం వెల్లివిరిసింది. మార్కెట్లో అధిక విలువ కలిగిన 30 టన్నులకు పైగా (300 క్వింటాళ్లకు సమానమైన) హిల్సా చేపలను వారు పట్టుకున్నారు. హిల్సా చేపకు మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. చేప పరిమాణం, బరువును బట్టి కిలో గ్రాముకు రూ. 600 నుంచి రూ. 1300 వరకు ధర పలుకుతుంది. వ్యాపారులలో పెద్ద పరిమాణంలో ఉన్న ఇలిసి చేపలకు అధిక డిమాండ్‌ ఉంది. హిల్సా చేపలు అధికంగా చిక్కడం వల్ల స్థానిక మార్కెట్‌తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చేపల సరఫరాకు ప్రయోజనం చేకూరింది. మత్స్యకారుల కథనం ప్రకారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అనుకూలమైన వాతావరణం కారణంగా లోతైన సముద్రంలోని ఇలిసి చేపలు ఒడ్డుకు వస్తాయి. ముఖ్యంగా నదీ ముఖద్వారం వద్ద నది నీరు, సముద్రపు ఉప్పునీటితో కలిసే చోట పోషకాలతో నిండిన ఉప్పు నీరు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో ఇలిసి చేపలు గుడ్లు పెట్టడానికి అక్కడికి వస్తాయి. మత్స్యకారులు దీనిని ప్రస్తుత సీజన్‌ లో అత్యుత్తమ చేపల వేట అని కూడా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement