గుప్తేశ్వరానికి పోటెత్తిన భక్తులు
మూడు రాష్ట్రాల నుంచి తరలివెళ్లిన భక్తులు
దండకారణ్యంలో ..
కొరాపుట్: దండకారణ్యంలో సహజ సిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరం బోల్ భం నినాదాలతో మార్మోగింది. శ్రావణ మాస సోమవారం కావడంతో ఒడిశాతో పాటు ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బోయిపరిగుడ సమితి సమితి లోని దండకారణ్య ప్రాంతం సుమారు 50 కిలోమీటర్ల దూరం రోడ్డు మొత్తం పాదచారులతో నిండిపోయింది. నదుల వద్ద పూజలు చేసి పవిత్ర జలాలను కావిడితో పట్టుకొని, కాషాయ వస్త్రాలు ధరించి, కాలికి చెప్పులు లేకుండా నడిచారు. వీరు గుప్తేశ్వరం చేరుకొని శబరి నది వద్ద స్నానాలు చేసి తాము తెచ్చిన పవిత్ర జలాలతో స్వామిని అభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
వెల్లి విరిసిన మానవీయత
బొయిపరి గుడ నుంచి గుప్తేశ్వరం వరకు మార్గ మధ్యంలో వందలాది సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ విడత సేవలు అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం రాత్రి వరకు ప్రతి చోట భక్తులకు ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నారు. అల్పాహారం, భోజనాలు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చి ప్రత్యేక టీ క్యాంప్‌లు ఏర్పాటు చేసి గ్లూకోజ్, బిస్కట్లు, పళ్లు ఉచితంగా అందిస్తున్నారు. యువత బైక్‌లపై తిరుగుతూ భక్తులకు కాళ్లు నొక్కడం, ఆయింట్‌మెంట్‌లు పూయడం చేస్తున్నారు. ఉచిత ఆహార పంపిణీ కూడా చేపట్టారు. మరికొందరు లైట్లు వేసి దారి చూపించారు. జయపూర్‌కి చెందిన రుద్ర సేవాదళ్ సంస్థ సభ్యులు సేవలు అందజేశారు.
ప్రభుత్వ చర్యలు
గుప్తేశ్వరం వద్ద వేలాది మంది భక్తులు గూమి గూడడంతో ప్రభుత్వం కూడా సేవలు అందజేస్తుంది. శబరి నది వద్ద ప్రత్యేక విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసింది. అగ్ని మాపక సిబ్బందిని మోహరించింది. రెవెన్యూ విభాగం సిబ్బంది గుడిలో దర్శనాలు తీరు పర్యవేక్షించారు. జయపూర్ ఎస్‌డీపీఓ అర్చితా మిట్టల్ తాను ఒక ఐపిఎస్ అధికారిణి అనే విషయం పక్కన పెట్టి మహిళలకు సేవలు అందజేశారు.
అంతా భక్తి మయం
ఎవరూ ఊహించని విధంగా సోమవారం వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కుండ పోతగా రోజంతా వర్షం పడుతున్నప్పటికీ భక్తులు కాషాయ వరద వలే తరలి వచ్చారు. గుప్తేశ్వరంలో నించోవడానికి ప్రదేశం లేని పరిస్థితి ఏర్పడింది. అత్యధికులు తమ సమస్యలు తీరడానికి, మరి కొందరు తమ కోరికలు తీరినందుకు పవిత్ర జలం మోస్తున్నామని పేర్కొన్నారు.


