కొరాపుట్: మౌలిక వసతులు లేని కారణంగా 180 మంది విద్యార్థులు హాస్టల్ వీడిన ఘటనపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి బొడ టెమెర గ్రామ పంచాయతీ సన్న టెమర గ్రామంలో దర్యాప్తు చే పట్టారు. జిల్లా ప్రణాళికా సంఘం చైర్మన్ హోదాలో ఉన్న బీజేపీకీ చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, జిల్లాస్థాయి సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోపణలు నిజమేనని వాంగ్మూలం ఇచ్చారు. హాస్టల్ వంట సిబ్బంది మాట్లాడుతూ వర్షాలు పడితే గదుల పైభాగం నుంచి నీరు వస్తున్నాయని చెప్పారు. హాస్టల్ కోసం నిల్వ చేసిన బియ్యం గోదామ్‌ను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ రాజ్యలక్ష్మి మహరణతో అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆమైపె వచ్చిన ఆరోపణలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులకు నివేదించారు.


