అమ్మవార్లకు
రాయగడ: పట్టణంలోని అమ్మవార్లకు ఆషాఢ మాసం సారెను భక్తులు సమర్పించారు. స్థానిక రాణిగుడఫారంలో ఉంటున్న మహిళలు శుక్రవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో రాణిగుడఫారం వద్ద గల మజ్జిగౌరీ అమ్మవారి మండపం ఈ మేరకు ప్రత్యేక పూజలను నిర్వహించి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, గ్రామ దేవతగా స్థానిక భైరవీధిలో పూజలందుకుంటున్న బురదల పోలమ్మ, ఉత్కళాంధ్రుల కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరీ అమ్మవార్లక సంప్రదాయ బద్ధంగా ఆషాఢమాసం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ముందుగా రాణిగుడఫారం వద్ద ఉన్న మజ్జిగౌరీ మండపం నుంచి వందలాది మంది మహిళలు సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామదేవత బురదల పొలమ్మకు సమర్పించారు. యాళ్ల కొండబాబు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పూలమాలను సమర్పించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మజ్జిగౌరీ మందిరానికి చేరుకున్న వీరంతా అక్కడ అమ్మవారికి పూజలు చేసి తమ వెంట తీసుకువచ్చిన సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవార్లే ఆడపడుచులు
పట్టణ ప్రజలను చల్లగా చూస్తున్న మజ్జిగౌరీ, బురదల పోలమ్మ అమ్మవార్లను తమ ఇంటి ఆడపడుచులుగా భావించి ఏటా ఆషాఢ మాసంలో సారెను సమర్పిస్తుండటం ఆనవాయితీగా వస్తుందని కొండబాబు తెలిపారు. ప్రతీ ఇంటి నుంచి ఒక్కో రకం వంటకాన్ని మహిళలను తీసుకువచ్చి సారెగా సమర్పించారని అన్నారు. అలాగే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీర, జాకెట్టు వంటివి అమ్మవారికి సమర్పించారు. అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తే తమకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని అదేవిధంగా వారి చల్లని కరుణా,కటాక్షాలు తమకు ఉంటాయని గట్టినమ్మకంతో మూడేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని వివరించారు. రైతన్నలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా పేర్కొన్నారు. అమ్మవార్లకు ఈతరహా సారె సమర్పిస్తే వర్షాలు సకాలంలో కురవడంతొ పాటు పంటలు పుష్కలంగా పండి అంతా సుభిక్షంగా ఉంటుందన్న గట్టినమ్మకంతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్‌డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, ప్రముఖ న్యాయవాది బ్రజసుందర్ నాయక్, వీరబాబు పాల్గొన్నారు.


