రాయగడ: జిల్లాలోని కొలనార సమితి రివల్‌కొన ఎస్‌ఎస్‌డి ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా వెంటనే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న 10వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టిసి) ఇచ్చి పాఠశాల నుంచి బహిష్కరించారు. వారిపై చందిలి పోలీస్ స్టేషన్‌లో చట్టపరంగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ నెల 1వ తేదీన క్రికెట్ ఆటను కేంద్రంగా చేసుకుని విద్యార్థుల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు, మరుసటి రోజు అర్ధ రాత్రి జానియర్ విద్యార్థులపై కొందరు సీనియర్ విద్యార్థులు శారీరక దాడికి పాల్పడినట్లు తేలింది. ఆగస్టు 4వ తేదీన బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయడంతో పాఠశాల యాజమాన్యం వె వెంటనే అధికారులకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆసీమారావ్ బాధిత విద్యార్థులను కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలల సంక్షేమ కమిటీ కూడా స్వతంత్రంగా విచారణ జరిపి బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసింది. అనంతరం బీడీఓ, డబ్ల్యూఈఓ, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షంలో ఘటనపై సమీక్ష నిర్వహించారు. ఈ విచారణలో ఏడుగురు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టమవ్వడంతో వారిని టీసీ ఇచ్చి పంపించారు. ఇదిలా ఉండగా బాధిత విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మానసిక సహాయం, కౌన్సెలింగ్ అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్లు అదేవిధంగా వసతి గృహంలో సాధరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అదేవిధంగా పాఠశాలలో 265 మంది విద్యార్థులకు కేవలం ఐదుగురు ఉపాధ్యాయులే ఉండటంతో బొధనతోపాటు వసతి గృహ నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విచారణలో తేలింది. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టళ్లలో కౌన్సెలింగ్, ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రత, గౌరవం విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్ తెలియజేశారు.


