ఒడిశా పోలీసులు, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ మధ్య అవగాహన ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఒడిశా పోలీసులు, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ మధ్య అవగాహన ఒప్పందం

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

ఒడిశా పోలీసులు, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ మధ్య అవగాహన ఒప్పందం

భువనేశ్వర్‌: ఒడిశా పోలీసుల సీఐడీ క్రైమ్‌ శాఖ, భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ (టెన్‌ఎఫ్‌ఎస్‌యూ) మధ్య మంగళవారం ఐదేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే దిశలో డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ సామర్థ్యం పటిష్టత, శాసీ్త్రయ దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందం లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా సమక్షంలో క్రైమ్‌ శాఖ డీజీపీ వినయతోష్‌ మిశ్రా, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూర్వి పోఖరియాల్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం డీజీపీ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఒడిశా పోలీసుల ఆధునీకరణ, అభివృద్ధి బాటలో ఈరోజు చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ 5 ఏళ్ల అవగాహన ఒప్పందం ఇరు సంస్థల మధ్య బలమైన పునాదిని ఏర్పరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం రాష్ట్ర సైబర్‌ పోలీసింగ్‌ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అని ఆయన అన్నారు. ఈ రోజుల్లో నేరాల స్వరూపం వేగంగా మారుతోంది. దాదాపు ప్రతి నేరంలోనూ డిజిటల్‌ సాక్ష్యం ఒక ముఖ్యమైన అంశంగా మారింది. మ్యూల్‌ ఖాతాలు, ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసాలు, డిజిటల్‌ అరెస్టు వంటి సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త క్రిమినల్‌ చట్టం ఫోరెన్సిక్‌ సైన్స్‌ను దర్యాప్తులో కేంద్ర బిందువుగా చేసింది. బలమైన ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాల సేకరణ, భద్రత నిర్వహణ ప్రతి పోలీస్‌ అధికారికి ప్రాథమిక నైపుణ్యంగా ఉండాలని డీజీపీ తెలిపారు. సైబర్‌ నేరాల సవాలును ఎదుర్కోవడానికి రాష్ట్రంలో 20 కొత్త సైబర్‌ క్రైమ్‌, ఆర్థిక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఠాణాలకు సుమారు రూ. 15 కోట్ల విలువైన ఆధునిక హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లను అందించారు. ఈ సాధనాల వినియోగానికి నాణ్యమైన శిక్షణ అవసరమన్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌యూతో కుదిరిన అవగాహన ఒప్పందం కేవలం శిక్షణకు మాత్రమే పరిమితం కాదు. క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్‌, ఉన్నత విద్య, ఉమ్మడి పరిశోధన, ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక కన్సల్టెన్సీ వంటి అనేక రంగాలను కూడా ఇది కవర్‌ చేస్తుందని డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో క్రైం శాఖ డీజీపీ వినయతోష్‌ మిశ్రా మాట్లాడుతూ ఎన్‌ఎఫ్‌ఎస్‌యూతో భాగస్వామ్యం కారణంగా పోలీస్‌ శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు, అధికారులకు ఉన్నత నాణ్యత గల సాంకేతిక శిక్షణను అందించడం సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలోని 34 పోలీస్‌ జిల్లాలు, క్రైమ్‌ శాఖలకు చెందిన మొత్తం 480 మంది అధికారులు, ఉద్యోగులకు 16 బ్యాచ్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీపీ వినయతోష్‌ మిశ్రా తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి బ్యాచ్‌లో 30 మంది పాల్గొంటారు. కానిస్టేబుల్‌ నుండి డీఎస్పీ వరకు ఉన్న అధికారులు ఈ శిక్షణలో భాగమవుతారని ఆయన తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో 5 రోజులు ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ క్యాంపస్‌లో, ప్రయోగశాల ఆధారిత శిక్షణ, మరో రోజు సైబర్‌ కాంప్లెక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. మొదటి బ్యాచ్‌ను ఉద్దేశించి డీజీపీ మాట్లాడుతూ సర్టిఫికెట్లు సాధించడంతో ఈ శిక్షణ పరిమితం కారాదని, కచ్చితమైన డిజిటల్‌ సాక్ష్యాల సేకరణ, శాసీ్త్రయ దర్యాప్తు నిర్వహణ, న్యాయ స్థానాల్లో ఆమోదయోగ్యమైన సాక్ష్యాలను ప్రవేశ పెట్టడం వంటి నైపుణ్యాలను పొందడంలో కూడా ఉందని అన్నారు. శిక్షణ తర్వాత తమతమ జిల్లాలకు తిరిగి వెళ్లి, ఈ జ్ఞానాన్ని తమ సహోద్యోగులతో పంచుకోవాలని డీజీపీ శిక్షణార్థులను కోరారు. ఎస్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ బాలా, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూర్వి పోఖారియాల్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (క్రైమ్‌) డాక్టర్‌ సార్థక్‌ షడంగి, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విశ్వకల్యాణ్‌ డాష్‌ మంగళ వారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement